హైదరాబాద్: జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కేటాయించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సంతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రావడం సంతోషంగా ఉందన్నారు. కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండే గ్లాసు గాజు గ్లాసు మాత్రమేనంటూ గ్లాసు గొప్పతనాన్ని వివరించారు. 

జీవితంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా గాజు గ్లాసులో టీ తాగినా, నచ్చిన పానీయాలు తాగినా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆ కిక్కే వేరుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి బాగా తీసుకు వెళ్లాలని నాగబాబు అభిమానులకు సూచించారు.  

మరోవైపు జనసేన పార్టీకి తాము ఇచ్చిన విరాళం చాలా చిన్నది అని అన్నారు. ప్రజల బాగోగుల కోసం మరియు శ్రేయస్సు కోసం తన తమ్ముడు చేస్తున్న కృషి, త్యాగానికి విరాళం అనేది చిన్న సహాయం అంటూ చెప్పుకొచ్చారు. 

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జవాబుదారీ తనం కోరుకుంటున్నాడని ప్రజలకు మంచి చెయ్యాలనే తపనతో పరితపిస్తున్నాడని చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటించడం మానేశాడని అలాగే కోట్లాది రూపాయలు వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని ప్రజల కోసం తన కుటుంబాన్ని సైతం వదిలేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. 

అలాంటి వ్యక్తి తనకు తమ్ముడిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. పవన్ చేస్తున్న పోరాటంలో ఇలా విరాళం ద్వారా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కుటుంబ సభ్యులం ఏమీ చెయ్యలేకపోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 

తాను గత కొంతకాలంగా తమ సోదరుడు గురించి ఆలోచించి ఏం చెయ్యలేకపోతున్నాననే తపనపడుతుండేవాడినన్నారు. అయితే వరుణ్ తేజ్ సైతం బాబాయ్ కి ఏదో చెయ్యాలని తనతో చెప్పడంతో ఇలా విరాళానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

పార్టీకి తాము ఇంకా సేవ చేస్తామని మా సహాయం మరింతగా ఉంటుందని నాగబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలని తపనపడే పవన్ ఆశయం నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు నాగబాబు తెలిపారు.  

ఆఖరున గాజు గ్లాస్ లో టీ తాగుతూ ఈ గ్లాస్ లో టీ తాగితే వచ్చే కిక్కే వేరబ్బా అంటూ డైలాగ్ వేస్తూ పార్టీ సింబల్ ను గుర్తు చేసుకున్నారు. జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చిన నేపథ్యంలో తన సోదరుడు, వరుణ్ తేజ్ ను పవన్ కళ్యాణ్ అభినందించారు. విరాళం పార్టీకి క్రిస్మస్ సర్ ప్రైజ్ అంటూ కొనియాడారు. 

 

యూరప్ ట్రిప్ అనంతరం తాను నేరుగా హైదరాబాద్ చేరుకుని తన సోదరుడు నాగబాబు, కుమారుడు వరుణ్ తేజ్ లను కలుస్తానని చెప్పుకొచ్చాడు. ఇకపోతే జనసేన పార్టీకి పవనన్ కల్యాణ్ తల్లి అంజనీదేవి రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు.