తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో మెడికల్ ఆక్సిజన్‌కు విపరీతమైన కొరత ఏర్పడింది. కోవిడ్‌కు ముందు తెలంగాణలో మెడికల్, పరిశ్రమలకు ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 160 టన్నులుగా వుండగా.. ఉత్పత్తి చేసే సామర్ధ్యం 100 టన్నులే.

అయితే మిగిలిన 60 టన్నలు ఆక్సిజన్ అవసరాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చేది. కోవిడ్ తర్వాత రోజుకు 200 టన్నులకు పైగా ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ అధికంగా మహారాష్ట్రకు తరలిపోతోంది.

Also Read:కష్టకాలంలోనూ కాసులకు కక్కుర్తి.. బ్లాక్‌మార్కెట్లకు తరలుతున్న రెమ్‌డిసివర్

దీంతో మెడికల్ ఆక్సిజన్ కోసం ఉత్పత్తి దారులపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మెడికల్ అవసరాల కోసం ఆక్సిజన్ సరఫరా చేయాలంటూ ఉత్పత్తిదారులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

అటు ఏపీలోనూ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఏ ఆసుపత్రికి వెళ్లినా ఒకటే సీన్.. నో ఆక్సిజన్. విజయవాడలో భారీగా ఆక్సిజన్ కొరత వుంది. రోజుకు వంద సిలిండర్లు అవసరమైతే 40 మాత్రమే లభిస్తున్నాయి.

ఆక్సిజన్ కొరత అధికంగా వుందని.. ఇలాంటి పరిస్ధితుల్లో రోగుల్ని కాపాడే పరిస్ధితి లేదంటున్నారు డాక్టర్లు. ఆక్సిజన్ కొరతపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. గతంతో పోలిస్తే మెడికల్ ఆక్సిజన్ అవసరాలు పెరిగాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల నుంచి మెడికల్ ఆక్సిజన్ ఆర్డర్లు పెరుగుతున్నాయి.