ఆంధ్రప్రదేశ్‌లో రెమ్‌డెసివర్‌కు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు కంపెనీలు, డీలర్లు. వాటిని బ్లాక్ మార్కెట్లలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. రెమ్‌డిసివర్ ఇంజెక్షన్‌ను ఏపీలో ఒకే కంపెనీ విక్రయిస్తుండటంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేని పరిస్ధితి నెలకొంది.

ఇతర రాష్ట్రాల్లోనూ కొరత కారణంగా ఏపీలో రెమ్‌డెసివర్ ఇంజెక్షన్ అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు అవగాహనా లేమితో కొందరు డబ్బులు దండుకోవడానికి మరికొందరు రెమ్‌డిసివర్ ఇంజెక్షన్‌ను ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఏడెనిమిది రోజుల్లో రెమ్‌డిసివర్ కొరతను అధిగమించవచ్చని నిపుణులు  అంటున్నారు. మరోవైపు  విజయవాడలో అంబులెన్స్‌లను ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఆసుపత్రిలో బెడ్స్ లేకపోవడంతో గంటల తరబడి పేషెంట్లను అంబులెన్స్‌ల్లోనే ఉంచాల్సి వస్తోంది. ఏక ధాటికి రోగికి నాలుగు గంటల పాటు ఆక్సిజన్ అందించలేకపోతున్నామని డ్రైవర్లు అంటున్నారు. ప్లాంట్‌లోనే ఆక్సిజన్ దొరకడం లేదని చెబుతున్నారు. 

Also Read:ఏపి సచివాలయం కరోనా కల్లోలం: అసిస్టెంట్ సెక్రటరీ మృతి, 60 మందికి పాజిటివ్

మరోవైపు సెకండ్‌ వేవ్‌లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండటం తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,962 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 6,096 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,48,231 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.