ఎంబీబీఎస్ ఫస్టియర్ స్టూడెంట్ హర్ష ప్రణీత్‌ రెడ్డి ఆత్మహత్య , ఏమైంది?

MBBS first year student Harsha praneeth Reddy commits suicide in Kurnool
Highlights

కర్నూల్ మెడికల్ కాలేజీ హస్టల్ హర్షప్రణీత్ రెడ్డి అనే ఎంబీబీఎస్ ఫస్టియర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకొన్నాడు. మృతుడి తండ్రి రామాంజులు రెడ్డి తన కొడుకును కొట్టిచంపారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


కర్నూల్: కర్నూల్ మెడికల్ కాలేజీ హాస్టల్‌ రూమ్‌లో  ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్ధి హర్ష ప్రణీత్ రెడ్డి  శుక్రవారం తెల్లవారుజామున  ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే తన కొడుకును కొట్టి చంపారని హర్షప్రణీత్ రెడ్డి తండ్రి రామాంజులు రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కడప జిల్లా అరవింద్ నగర్‌కు  చెందిన  హర్ష ప్రణీత్ రెడ్డి కర్నూల్ మెడికల్ కాలేజీలో  ఎంబీబీఎస్  మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే కాలేజీలో  ర్యాగింగ్ ఉందని తన కొడుకు  తనకు చెప్పారని  రామాంజులు రెడ్డి  చెబుతున్నారు.

కాలేజీలో ర్యాగింగ్ విషయమై  తనకు చెప్పారని  అయితే కాలేజీలో ర్యాగింగ్ సాధారణమేనని జాగ్రత్తగా చదువుకోవాలని తాము అతడికి సూచించినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. ర్యాగింగ్ ను అరికట్టడంలో కాలేజీ యాజమాన్యం వైఫల్యం చెందిందని  రామాంజులు రెడ్డి ఆరోపిస్తున్నారు. 

తన కొడుకు మరణ విషయమై  అనేక అనుమానాలున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. హర్షప్రణీత్ రెడ్డి మృతి విషయమై కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌తో  వాగ్వాదానికి దిగారు . మృతదేహంపై ఉన్న రక్తం మరకల ఆధారంగా  తన కొడుకును కొట్టి చంపారని ఆయన ఆరోపిస్తున్నారు.

అయితే రామాంజులు రెడ్డి ఆరోపణలను కాలేజీ ప్రిన్సిపాల్ కొట్టి పారేస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ‌లో వాస్తవాలు వెలుగుచూస్తాయని ఆయన ప్రకటించారు. తమ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదన్నారు. ర్యాగింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే హర్ష ప్రణీత్ రెడ్డి  మృతికి సింబంధించి అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున  రూమ్‌లోకి వెళ్లిన హర్షప్రణీత్ రెడ్డి  తలుపులు వేసుకొన్నాడని,  హర్ష ప్రణీత్ రెడ్డిని బయటకు రావాలని ఇతర విద్యార్ధులు తలుపులు బాదుతున్న దృశ్యాలు సీసీటీవి కెమెరాల్లో రికార్డయ్యాయని పోలీసులు చెబుతున్నారు.

హర్షప్రణీత్ రెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పరీక్షలు వారం రోజుల్లో ప్రారంభమయ్యే సమయంలో ర్యాగింగ్ జరిగే ఆస్కారమే లేదని  కాలేజీ యాజమాన్యం చెబుతుంది.  
 

loader