హుజూర్ నగర్ ఉప ఎన్నిక, ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలంతా మరో కీలక అంశమైన  ఈఎస్ఐ స్కాం గురించి అంతలా పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయల అవకతవకలు జరిగినప్పటికీ మిగిలిన రాజకీయ ప్రాధాన్యమైన అంశాల వల్ల ఈ స్కామ్ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. 

ఈఎస్ఐ స్కాం నిందితులను బుధవారం  నాడు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో  ఇప్పటికే ఏసీబీ అధికారులు 13 మందిని అరెస్ట్ చేశారు. చంచల్‌గూడ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఈఎస్ఐ డైరెక్టర్‌ దేవికారాణి సహా మరో 13 మందిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

ఈ 300 కోట్లకు సంబంధించిన స్కామ్ నీడలు ఆంధ్రప్రదేశ్ లోనూ వెలుగుచూస్తున్నట్టు సమాచారం. జగన్ సర్కార్ సీక్రెట్ గా దీనిపై జరిపిన విచారణలో ఈ అక్రమాలకూ సంబంధించిన జాడలను ఆంధ్రప్రదేశ్ లోనూ గుర్తించారట.

టీడీపీ హయాంలో కార్మిక శాఖా మంత్రులు గా పనిచేసిన ఇద్దరు సీనియర్ నేతల ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టిడిపిగా పోటీ నడుస్తున్న నేపథ్యంలో టీడీపీ చుట్టూ ఈ ఉచ్చు బిగించడానికి రెడీ అవుతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లోని ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో, డయాగ్నస్టిక్ సెంటర్లతోపాటు హెడ్ ఆఫీస్ లోకూడా తనిఖీలు గత నాలుగు రోజులుగా సాగుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.

తెలంగాణాలో సాగుతున్న విచారణ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ స్కామ్ కు సంబంధించి కూపీ లాగారట. దీనికి సంబంధించి ఆ సమయంలో పనిచేసిన అధికారులు, మాజీ మంత్రులను విచారించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. 

ప్రధానంగా టీడీపీ మౌత్ పీస్ గా, వైసీపీకి పక్కలో బల్లెంలా తయారయిన టీడీపీ సీనియర్ నేత అప్పటి కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు తోపాటు తరువాత కార్మిక శాఖా మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణలకు ఈ స్కామ్ లో ఎమన్నా ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం.

టెలి హెల్త్ సర్వీసెస్ సిబ్బంది వేతనాల గోల్ మాల్, అత్యధిక ధరలకు డయాగ్నస్టిక్ పరికరాలు కొన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. పితాని హయాంలో మందులు అధిక ధరలకు కొన్నట్టు ఆధారాలను దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు చెబుతున్నారు. 

ఈ విచారణలో అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా ఏ చిన్న సాక్షం దొరికినా ఆయన్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతుంది. ప్రతిపక్షం దూకుడుకు కళ్లెం వేయాలంటే వారి అవినీతిని బయట పెట్టడం అత్యవసరమని జగన్ సర్కార్ భావిస్తోంది. వైసీపీ గత చర్యలను పరిశీలించినా ఇదే విషయం మనకు అవగతం అవుతుంది.