ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు.

అయితే ఆదాయాన్నిచ్చే రెండు పదవుల్లో ఒకే వుండరాదనే నిబంధనతో పాటు మరికొన్ని సాంకేతిక కారణాలు అడ్డుగా ఉండటంతో విజయసాయి నియామకాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

ఈయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. వైసీపీ నుంచి 22 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ.. వారిలో ఎవరికీ ఈ పదవి ఇవ్వాటానికి అవకాశం లేదు.

దీంతో గతంలో ఎంపీగా పనిచేసి... ఢిల్లీ వ్యవహారాలతో పాటు రాష్ట్ర పరిపాలన మీదా అవగాహన వున్న మాజీ ఎంపీ మోదుగుల పేరు పరిశీలనకు వచ్చింది. దీంతో ఇయన పేరునే వైఎస్ జగన్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తాజా సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. టీడీపీ అభ్యర్ధి గల్లా జయదేవ్ చేతిలో 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణతో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారంటూ ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.