అమరావతి: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ లేఖలో చంద్రబాబు క్రిమినల్ కేసుల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంపై ఓటుకు నోటు వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారా అంటూ ప్రచారం జరుగుతుంది. 

ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి రావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ని కోరారు. మంగళవారం ఢిల్లీలో సీజే ని కలిసిన చంద్రబాబు ఫిబ్రవరి 3న హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. 

ఈ అంశంపై జెరూసలేం మత్తయ్య జస్టిస్ రంజన్ గొగోయ్ కి లేఖ రాశారు. చంద్రబాబుపై ఉన్న క్రిమినల్ కేసులు స్టేలో ఉన్నాయని లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ప్రారంభోత్సవానికి వెళ్తే ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని స్పష్టం చేశారు. ఫలితంగా న్యాయవ్యవస్థ విశ్వసనీయత తగ్గే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు.