అమరావతి: గుంటూరు జిల్లాలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.  పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సందిగా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అధికారులను ఆదేశించారు.

దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని కలెక్టర్‌ వెల్లడించారు.

నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఒక్కరే రావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు కార్యాలయాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు రహదార్లపైకి ఉద్యోగులను అనుమతించేది లేదని... దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు, ప్రజలు బయటకు రావాలని శామ్యూల్ ఆనంద్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 గంటల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ రెండు కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 892 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. గురువారంనాడు అనంతపురం జిల్లాలోని మనురేవుకు చెందిన 70 ఏల్ల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. గుంటూరులోని ఎన్ఆర్ పేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కూడా మరణించాడు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.

గురువారంనాడు 363 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం 365కు చేరుకున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15 కేసులు నమోదయ్యాయి. గురువారంనాడు కొత్తగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కు చికిత్స పొంది ఇప్పటి వరకు పది మంది డిశ్చార్జీ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాలేదు.