ఓ కామాంధుడి కబంధహస్తాల్లో చిక్కిన ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తన ఇంట్లో అద్దెకుండే వివాహితపై కన్నేసిన ఓ వ్యక్తి  దారుణానికి పాల్పడ్డాడు. ఆమె వ్యక్తిగత ఫోటోలను సంపాదించి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరించి బలవంతంగా లొంగదీసుకున్నాడు. అయితే ఈ విషయం కట్టుకున్న భర్తకు తెలియడంతో తీవ్ర మనోవేధనకు గురైన సదరు వివాహిత బలవన్మరణానికి ప్రయత్నించి కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

ఈ సంఘటనకు సంబంధించి  బాధిత మహిళ భర్త, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం రుషంగా గ్రామానికి చెందిన పోలురాజు, రజనీ దంపతులకు ఇద్దరు సంతానం. ఉపాధి నిమిత్తం పోలురాజు తన కుటుంబంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి వలసవచ్చాడు. ముత్యాలరెడ్డి నగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. 

అయితే భర్త పనిపై, పిల్లలు స్కూల్ కు వెళ్లిపోవడంతో పొద్దున నుండి సాయంత్రం వరకు రజని ఇంట్లో ఒంటరిగా వుండేది. దీన్ని గమనించిన ఆ ఇంటి యజమాని ఇసాక్ ఆమెపై కన్నేశాడు. రహస్యంగా ఆమె వ్యక్తిగత ఫోటోలను సంబంధించిన అతడు వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఇలా రజనిని లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే ఇటీవలే ఈ విషయం రజని భర్త పోలురాజు కు తెలిసింది. దీంతో  తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత మహిళ ఉరేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చివరి శ్వాసతో కొట్టుమిట్టాడిన ఆమెను కాపాడిని భర్త ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

తన భార్యను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకుని ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఇసాక్ పై పోలురాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికుల సాయంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి అతడు ఎస్పీని కలిసి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని...దాని  ఆధారంగా నిందితుడిని కఠిన  శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ వారికి హామీ ఇచ్చాడు.