భర్తకి తనకి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉందని అతనిని కాదని.. ప్రియుడితో పారిపోయింది. కానీ.. తమ ప్రేమను సమాజం అంగీకరించదనే భయంతో.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పులివెందలకు చెందిన విద్యుత్ శాఖ ఏడీఏ రఘుతో దివ్య అనే యువతితో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి సంతానం లేదు. అంతేకాకుండా.. రఘు వయసులో దివ్య కన్నా.. 23ఏళ్లు పెద్ద. ఈ విషయంలో దివ్య ఎప్పుడూ మదనపడుతూ ఉండేది.

కాగా.. ఇటీవల ఫేస్ బుక్ లో ఖాతా తెరిచిన దివ్యకి.. శ్రవణ్ కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పథకం ప్రకారమే..ఇద్దరూ ఇల్లు వదిలిపారిపోయారు. ట్రైన్ లో నంద్యాల చేరుకున్న వీరు.. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించవనుకున్నారు. 

సమాజం కూడా వారి ప్రేమను అంగీకరించదనే బాధతో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగేశారు. నంద్యాల రైల్వేస్టేషన్ లోనే నురగలు కక్కుకొని పడిపోయారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. శ్రవణ్ మృతిచెందాడు. దివ్య ఆస్పత్రిలో  చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.