ప్రియుడితో కలిసి ఓ వివాహిత కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ప్రకాశం బ్యారేజీపై నుండి  దూకిన ఈ జంటను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించారు. అయితే వివాహితను ప్రాణాలతో కాపాడగలిగినా యువకుడు మాత్రం మృత్యువాతపడ్డాడు. 

ఈ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఇలా వున్నాయి. విజయవాడకు చెందిన ఉరుసు ఉమకు వివాహమై ఇద్దరు పిల్లలున్నాయి. అయితే పెళ్ళికి ముందు తన బంధువైన ఉరుసు సురేష్ ను ప్రేమించిన ఆమె పెళ్లి తర్వాత కూడా అతడితో రహస్య బంధాన్ని కొనసాగిస్తోంది. అయితే ఈ మధ్య ఆమె ఏకంగా భర్తను కాదని ప్రియుడి వద్దే వుంటోంది. ఇద్దరు కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. 

అయితే ఈ వ్యవహారం గురించి సురేష్ కుటుంబ సభ్యులు వీరిద్దరిని గట్టిగా మందలించారు. ఇలాగే కుటుంబ పరువును తీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని కాస్త గట్టిగా హెచ్చరించారు. దీంతో ఎక్కడ తామిద్దరం  విడిపోవాల్సి వస్తుందోనని భయపడ్డ  వీరు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

కృష్ణానదిలో నుండి ఆమెను మొదట బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే యువకుడి  మృతదేహాన్ని కూడా బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వీడియో