మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న రామోజీరావు, శైలజాకిరణ్ లను ఆంధ్రప్రదేశ్ లో విచారించనుంది సీఐడీ. ఈ మేరకు జూలై 5వ తేదీన గుంటూరుకు రావాలని నోటీసులు జారీ చేసింది. 

అమరావతి : మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న ఆ సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ లు ఏపీకి రావలసిందిగా సిఐడి నోటీసులు జారీ చేసింది. దీంతో మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక ఆక్రమాల కేసులో మరో కీలక ముందడుగు పడినట్లు అయింది. ఈ కేసులో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడుల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ1గా, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ఏ2గా ఉన్నారు. వీరిద్దరిని ఆంధ్రప్రదేశ్లో విచారించాలని సిఐడి నిర్ణయించింది. ఈ మేరకు జూలై 5వ తేదీన ఉదయం 10:30 గంటలకు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణ నిమిత్తం వీరిద్దరూ హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

ఆర్బీఐ నిబంధనలు, కేంద్ర చిటిఫండ్స్ చట్టాలను ఉల్లంఘిస్తూ.. మార్గదర్శి చిట్ ఫండ్స్.. ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తేలింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ,,సిఐడిలు చేసిన సోదాల్లో ఈ వివరాలు ఆధారాలతో సహా బహిర్గతమయ్యాయి. దీంతో ఎండి శైలజ కిరణ్, చైర్మన్ రామోజీరావులకు సిఐడి విచారణకు పిలుస్తోంది. ఇప్పుడు రామోజీరావు శైలజ కిరణ్ లతో పాటు గుంటూరు మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్ ( ఫోర్ మెన్) శివరామకృష్ణకు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ తాజా అంశంతో.. సిఐడి అధికారులు ఇప్పటికే రామోజీరావు శైలజ కిరణ్ ల తో పాటు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్ల మీద కేసు నమోదు చేసి ఏడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినట్లయింది. ఈ విషయం తెలిసిందే. సిఐడి ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా రామోజీరావును ఒకసారి విచారించింది. శైలజ కిరణ్ ను హైదరాబాదులోని వారి నివాసంలో రెండుసార్లు ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరింత లోతుగా విచారించేందుకు గుంటూరులో వారిని విచారించాలని సిఐడి నిర్ణయించింది.

ఫేస్ బుక్ ప్రెండ్ తో యువతి నగ్నంగా వీడియో కాల్... అసలు కథంతా ఆ తర్వాతే..!

మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన చందాదారుల సొమ్మును చిట్ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా వేరే దగ్గరికి మళ్లించింది. ఈ మేరకు రామోజీరావు, శైలజాకిరణ్, ఇతరుల మీద సిఐడి కేసును నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్ ల ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లోనే నేరానికి పాల్పడింది. ఎఫ్ఐఆర్ లు కూడా ఏపీలోనే నమోదయ్యాయి. చట్టం ప్రకారం ఈ కేసులో నిందితులను కూడా ఆంధ్రప్రదేశ్లోనే విచారించాల్సి ఉంటుంది.

ఇదే విషయాన్ని సిఐడి అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్ లను హైదరాబాదులో విచారించిన సమయంలో వారికి తెలిపారు. భవిష్యత్తులో ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం.. వారిద్దరిని ఆంధ్రప్రదేశ్కు పిలిచి విచారిస్తామని.. సిఐడి అధికారులు ఇంతకుముందే మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నాయి.

దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు, సిఐడి విభాగాలు…ఈడి, సిఐడి లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు…అన్నీ కూడా నిందితులు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వచ్చి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నాయి. ఈ మేరకే విచారణను సాగిస్తున్నాయి. ఈ కేసులో సిఐడి వారి ఇంటి వద్దకు వెళ్లి విచారించడం సరికాదని న్యాయ నిపుణులు అంటున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో నిందితులు రామోజీరావు శైలజాకిరణ్ లు ప్రముఖులు కావడం.. వారికి పత్రిక, సొంత మీడియా ఉన్నందువల్లే ఇలా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నమోదైన 7 ఎఫ్ఐఆర్లకు సంబంధించి దశలవారీగా విచారించాలని సిఐడి భావిస్తున్నట్లుగా సమాచారం. దీంట్లో భాగంగానే జూలై 5వ తేదీన రామోజీరావు, శైలజాకిరణ్ లను గుంటూరులోని అరండల్ పేట మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో విచారించనున్నట్లు తెలుస్తోంది. అరండల్ పేట బ్రాంచి కార్యాలయం మేనేజర్ కు కూడా నోటీసులు జారీ చేశారు,