వేలకోట్ల విలువైన బాక్సైట్ ఖనిజ నిల్వలు, మరోవైపు మావోయిస్టుల ప్రాబల్యం మధ్య ఏమి చేయాలో తెలీక పలు సంస్ధలు ఇబ్బందులు పడుతున్నాయి.
విశాఖప్నటం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలైంది. తమ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నట్లు కొందరు గిరిజనులు హై కోర్టులో కేసు దాఖలు చేసారు. వారి పిటీషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏజెన్సీ ఏరియాల్లో నివశిస్తున్న గిరిజనుల హక్కులను ప్రభుత్వం ఏ విధంగా పరిరక్షిస్తున్నదో చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.
అసలు ఈ మధ్య ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులో (ఏఓబి) జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపధ్యం కూడా మైనింగేనని అనేక ఆరోపణలు వినబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. అందులో బాక్సైట్ ఖనిజం కూడా ఒకటి. అయితే, సదరు ఖనిజాన్ని తవ్వుకోవటానికి చాలా కాలంగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాఅనుకున్నంత సాఫీగా సాగటం లేదు.
చంద్రబాబునాయడు ప్రభుత్వం, తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలపై పూర్తిస్ధాయి దృష్టి పెట్టాయి. అయితే అనుకున్నంత సఫలం కాలేదు. ఆ తర్వాత రోశయ్య, కిరణకుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా కొంత వరకూ బాక్సైట్ తవ్వకాలపై దృష్టి పెట్టినవే. ఏకంగా ప్రభుత్వాలే ప్రయత్నించినా బాక్సైట్ తవ్వకాలు అనుకున్నంత సాఫిగా సాగకపోవటానికి ఏకైక కారణం మావోయిస్టులే.
విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా మొత్తం మీద దశాబ్దాల తరబడి మావోయిస్టుల ప్రభావమే ఎక్కువ. అందుకనే అక్కడ మావోయిస్టుల మాటే వేద వాక్కు. మావోయిస్టులు ఏమి చెబితే సుమారు 11 మండలాల పరిధిలో అదే జరుగుతుంది. ప్రజా ప్రతినిధిలే కాదు ప్రభుత్వ అధికారులు సైతం మావోయిస్టుల ఆదేశాలకు లోబడి పనిచేయాల్సిందే. ఒకసారంటూ బాక్సైట్ తవ్వకాలు మొదలైతే తమ అస్ధిత్వానికే ఇబ్బందని గ్రహించిన మావోయిస్టులు ఎవరిని కూడా తవ్వకాలకు అనుమతించటం లేదు. ఒకవేళ ఎవరైనా తవ్వకాలు జరిపినా సదరు సంస్ధలకు చెందిన ఉద్యోగులనో లేదా మద్దతు ఇచ్చిన ప్రజా ప్రతినిధులనో కిడ్నాపులు చేయటం, చంపేయటం చేసేవారు.
దాంతో బాక్సైట్ తవ్వకాలంటేనే ప్రైవేటు సంస్ధలకు వణుకు మొదలైంది. ఒకవైపు వేలకోట్ల విలువైన బాక్సైట్ ఖనిజ నిల్వలు, మరోవైపు మావోయిస్టుల ప్రాబల్యం మధ్య ఏమి చేయాలో తెలీక పలు సంస్ధలు ఇబ్బందులు పడుతున్నాయి. ఖనిజ తవ్వకాలు సాఫీగా సాగాలంటే మావోయిస్టుల ఉనికి ఉండకూడదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణాల వల్లే పోయిన నెలలో ప్రభుత్వం భారీ ఎత్తున ఎన్ కౌంటర్ కు పాల్పడిందని మావోయిస్టు నేతలు, పౌరహక్కుల సంఘాల నేతలు కూడా బాహాటంగానే ఆరోపణలు గుప్పించటం గమనార్హం. ఈ నేపధ్యంలోనే విశాఖపట్నం ఏజెన్సీకే చెందిన పలువురు యువకులు న్యాయస్ధానంలో కేసు దాఖలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
