రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు అని జగన్ ప్రకటించిన ‘ఢిల్లీ డిక్లరేషన్ ’ 2019 ఎన్నికల్లో వైసిపి బిజెపితో చేతులు కలుపుతుందనే చర్చకు దారి తీసింది. ఈ డిక్లరేషన్ వైసిపి నేతల్లో గుబులు పుట్టిస్తున్నది. బిజెపితో పొత్తు లాభనష్టాలను అంచనావేయడం మొదలుపెట్టారు. ఎసియానెట్ సంప్రదించినవారిలో చాలా మంది బిజెపితో వెళ్లితే తక్షణ ప్రయోజనం ఉండొచ్చేమో ముందు ముందు నష్టం ఉంటుందని చెబుతున్నారు. వాారికి ధైర్యం చెబుతు జగన్ ప్రతి నాయకుడికి లేఖ రాస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీ ఎ అభ్యర్థికి మద్దతివ్వాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైందికాదని పార్టీలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది.
మొన్న డిల్లీవెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలుసుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్ధతునిస్తామని జగన్ తెలియచేసిన సంగతి తెలిసిందే. ఇదేమీ రహస్యం కాదు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీ మద్దతునీయడం మామూలే. ఈ విషయంలో పేచీ లేదు. అయితే, జగన్ ప్రకటన వల్ల 2019 ఎన్నికల్లో వైసిపి బిజెపితో చేతులు కలుపుతుందనే చర్చ టిడిపిలో, మీడియాలో మొదలయింది. ఇది వైసిపి నేతల్ల గుబులు పుట్టిస్తున్నది. బిజెపితో పొత్తు లాభనష్టాలను అంచనావేయడం మొదలుపెట్టారు. ఎసియానెట్ సంప్రదించినవారిలో చాలా మంది బిజెపితో వెళ్లి తక్షణ ప్రయోజనమెలా ఉన్నా కొంత నష్టం ఉంటుందని, దానిని నివారించేందుకు జగన్ కట్టుదిట్టమయిన వ్యూహం అనుసరించాలని అభిప్రాయపడుతున్నారు.
బిజెపికి మద్దతివ్వడంలో తప్పేమీ లేదని బయటకు చెబుతున్నా వైఎస్ఆర్ కష్టపడి సంపాదించిన ఓటు బ్యాంకు దెబ్బ తింటుందనే ఆందోళన వారిలోవుంది. ప్రధాని కార్యాలయం పిలుపు రాగానే జగన్ పార్టీలో చర్చ లేకుండా ప్రకటన చేశారనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన నాయకులలో పెద్ద గా వ్యతిరేకత లేదు. చిత్రమేమిటంటే, అక్కడి బిజెపి నాయకులు జగన్ తో చేతులు కలిపేందుకు ఎదురు చూస్తున్నారు. రాయలసీమలోని బిజెపినేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మీదు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీద బాగా వ్యతిరేకత ఉంది. అందుకే జగన్ ‘ఢిల్లీ డిక్లరేషన్’ రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు దోహదపడుతుందని వారుంటున్నారు. దాదాపు వైసిపినేతలు కూడ ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
అయితే,రాయలసీమలో అనేక నియోజకవర్గాలలో ముస్లింలు బాగా ఎక్కువ. బిజెపితో చేతులు కలిపితే, ముస్లిం ఓట్ బ్యాంక్ కచ్చితంగా వైసిపిని వదిలేస్తుందని కర్నూలు జిల్లా నాయకుడొకరు వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికలలో వైసిపి పెద్ద ప్రతిపక్ష పార్టీ గా నిలబడేందుకు కారణం ముస్లింలు, ఎస్ సి ఎస్టీలేనని వారి అభిప్రాయం. వైసిపి ఓడిపోయిన చోటకూడా ఓట్లు బాగా పడటం దీనికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. చాాలా మంది వైఎస్ ఆర్ అభిమానులు బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇంత ఐడియాలాజికల్ బేస్ ఉన్న పార్టీ ఆంధ్రలో వైసిపి ఒక్కటే.దీనికి కారణం,వైెఎస్ ఆర్ చాలా జాగ్రత్తగా ముస్లింలను, ఎస్ సి ఎస్టీలను తన వైపు తిప్పుకోవడమేనని ఏషియానెట్ మాట్లాడిన వారిలో ఎక్కువ మంది చెప్పారు. ఈ విషయంలో వైసిపి నేతలలో చాలా స్పష్టత ఉండటం విశేషం.
జగన్ నిర్ణయంపై కోస్తా జిల్లాల నాయకత్వంలో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. “ఇంతవరకు ముస్లింలు, దళితులు వైసిపి ఓటు బ్యాంకు.వీళ్లలో కొంతమంది టిడిపి వైపు ఉన్నా మెజార్టీ వైసిపి వారే. దీనికి కారణం, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్ర మాల ఫలితం ఈ ప్రాంతంలో అందుకోని కుటుంబం లేదు. దానికి తోడు వీళ్లు సహజంగా బిజెపి వ్యతిరేకులు. ఇపుడు బిజెపి అనుసరిస్తున్నవిధానాల వల్ల వారు వైసిపితో ఉండటం భద్రతగా ఫీలవుతున్నారు. 2014లో బిజెపితో టిడిపి జత కట్టిందనే అభిప్రాయంతో మైనార్టీలు ఎక్కువ మంది వైసిపికి అనుకూలంగా మారారు. 2014 ఎన్నికల్లో అదే లాభించినందునే 64 ఎమ్మెల్యే సీట్లతో బలమయిన ప్రతిపక్ష పార్టీగా వైసిపి నిలబడింది. 2019లో వైసిపి బిజెపి కలసి వెళ్తే,ప్రజలకేమీ చెప్పాలి,’ కొస్తాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు ప్రశ్నిస్తున్నారు.
“రాష్ట్ర విభజన తర్వాత, అంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించే శక్తి ఒక్క చంద్రబాబు నాయుడికే ఉందని తెగ ప్రచారం చేసి, ఎన్నికల్లో గెల్చినా, వైసిపి దేశంలో ఏరాష్ట్రంలో కూడా లేనంత బలమయిన ప్రతిపక్ష పార్టీగా వచ్చింది. దీనికి డబ్బుకారణం అనడానికి వీల్లేదు. ఇది వైసిపికి ఐడియాలాజికల్ సపోర్టు. అది దెబ్బతినకూడదు,’ కోస్తాకే చెందిన పార్టీ పై స్థాయి నాయకుడొకరు చెప్పారు.
ఇదొక పెద్ద సమస్య అని దీనికి కన్విన్సింగ్ వివరణ ప్రజలకు చెప్పకుండా వెళ్తే ప్రమాదమని ఆయన హెచ్చరించారు.
జగన్ గుర్తుంచుకోవలసి విషయాలేమిటో కూడా వైసిపి నాయకులు చెబుతున్నారు. అవి:
*2014లో వైసిపికి వచ్చిన వోట్లలో కనీసం 45 శాతం పైగా ఓట్లు దళిత, మైనారిటీలు ఉన్న ప్రాంతాలనుంచే వచ్చాయి.
*రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయేకి మద్దతు అనేసరికి 2019 వ్యూహం మీద ఈ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి
*2019 ఎన్నికలలో బిజెపి భాగస్వామిగా ఉన్నతెలుగుదేశం పరిపాలను ఎండగట్టడం సాధ్యమా. ఒక్క బిజెపి మంత్రి కూడా ఇప్పటిదాకా తెలుగుదేశం పరిపాలన బాగా లేదని చెప్పలేదు. సరిగదా, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వరమని ఆకాశానికెత్తారు.
*ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనోళ్ల సలహాలే జగన్ నిర్ణయానికి కారణం.
*జగన్మో నిర్ణయం 2019 ఎన్నికల్లో రాజకీయంగా టిడిపి లబ్ది కలిగించకుండా నివారించే వ్యవూహమేమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక లేఖ జిల్లాలకు రాస్తున్నట్లు సమాచారం. ఈ లేఖ వివరాలు వెల్లడికావడం లేదు.అయితే,దళిత, మైనారిటీ ఎమ్మెల్యలే పార్టీని వెళ్లిపోయారని, అందువల్ల బిజెపితో కలిస్తే నష్టం వస్తుందనే అందోళన అవసరం లేదని ఈ లేఖ ధైర్యం చెబుతుందని ఒక సీనియర్ నాయకుడు వెళ్లడించారు.
