మణిపూర్ హింస: ఏపీలో మన్యం బంద్ నిర్వహిస్తున్న గిరిజన సంఘాలు
మణిపూర్ హింసపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం బంద్ నిర్వహిస్తున్నారు గిరిజన సంఘాలు.
అమరావతి: మణిపూర్ లో హింసను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం బంద్ ను నిర్వహిస్తున్నాయి గిరిజన సంఘాలు. ఈ బంద్ నేపథ్యంలో పర్యాటకులను ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలకు రావొద్దని గిరిజన సంఘాల నేతలు కోరారు. అంతేకాదు బంద్ ను పురస్కరించుకొని ఇవాళ గిరిజన ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు కూడ నడపడం లేదు. పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. మణిపూర్ లో ఆదీవాసీలపై హింసను నిరసిస్తూ గిరిజన సంఘాల నేతలు నిరసనకు దిగారు.
మణిపూర్ లో రెండు తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘర్షణ నేపథ్యంలో మణిపూర్ లో హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. ఈ ఏడాది మే మాసంలో మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ విషయమై పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మణిపూర్ లో హింస అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు నిరసనకు దిగాయి. గత నెల 20వ తేదీ నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మణిపూర్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఈ అంశంపై నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.