టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నానన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించడంపై ఆయన స్పందించారు.

హైకోర్టులో తప్పించుకున్నా.. సుప్రీంకోర్టులో మొట్టికాయలు తప్పవని ఆళ్ల తెలిపారు. తన దగ్గర వున్న ఆధారాలతో సీఐడీకి ఇచ్చానని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే వాటిని నిరూపించడానికి కొంత సమయం పడుతుందని ఆళ్ల అభిప్రాయపడ్డారు. 

కాగా, చంద్రబాబు, మాజీమంత్రి నారాయణల సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సీఐడీ కేసు విచారణపై న్యాయస్థానం 4 వారాలు స్టే విధించింది. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయస్థానం కోరింది.

ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని, పూర్తి స్థాయి విచారణకు అనుమతించాలని హైకోర్టును సీఐడీ అధికారులు కోరారు. దీనిపై స్పందించిన కోర్టు..  ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో చంద్రబాబు, నారాయణకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా? అని నిలదీసింది.