యాక్టీవ్‌‌గా ఆర్కే గ్రూప్.. కత్తులు దూస్తోన్న వేమారెడ్డి , గంజి వర్గాలు .. వైసీపీని హ్యాట్రిక్ కొట్టనిస్తారా

వైసీపీ ఇప్పుడు మంగళగిరిలో వర్గాలుగా చీలిపోయింది. ఎమ్మెల్యే ఆర్కే, దొంతిరెడ్డి వేమారెడ్డి, గంజి చిరంజీవి వర్గాలుగా శ్రేణులు విడిపోయారు. ఎవరికి వారే అన్నట్లుగా వున్న వైసీపీని తిరిగి ఏకతాటిపైకి తెచ్చేందుకు విజయసాయిరెడ్డి, మర్రి రాజశేఖర్‌లు 3 గ్రూపుల్ని సమావేశపరిచారు. 

mangalagiri ysrcp cadre divided into 3 parts due to differences between leaders ksp

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. కీలక నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన కుప్పం, పులివెందుల, మంగళగిరి, హిందూపురం, భీమవరం, గాజువాకలపై పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో మంగళగిరి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచి జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వైసీపీని వీడటం దుమారం రేపింది. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుకు ముందే ఆర్కే పార్టీని వీడటం వైసీపీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేశాయి. 

ఇక్కడ టీడీపీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బరిలో దిగారు. 2019లో ఆర్కే చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన చినబాబు.. ఈసారి మాత్రం విజయం సాధించాలని గట్టి పట్టుదలగా వున్నారు. 2019లో ఓడిననాటి నుంచి నియోజకవర్గంలో ప్రజలతోనే మమేకం అవుతూ వస్తున్నారు. వైసీపీపై పోరాటంతో పాటు ఏ సమస్య వచ్చినా తానున్నాననే భరోసా ఇస్తున్నారు. మరోసారి లోకేష్‌ను ఓడించాలని సీఎం వైఎస్ జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2014, 2019లలో ఇక్కడి నుంచి వైసీపీ తరపున ఆళ్ల ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు, 2024లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన గట్టి పట్టుదలగా వున్న సమయంలో ఇన్‌ఛార్జ్‌ల మార్పు వ్యవహారం.. జగన్‌తో ఆర్కే‌కి గ్యాప్ తెచ్చింది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 

ఆర్కే పార్టీని వీడటంతో వెంటనే స్థానికుడు, పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని జగన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు . తద్వారా మంగళగిరిలో పెద్ద సంఖ్యలో వున్న పద్మశాలి, ఇతర బీసీ ఓట్లు వైసీపీకేనని .. దీనికి తోడు పార్టీని తొలి నుంచి అంటిపెట్టుకుని వున్న రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లు తమకే పడతాయని జగన్ అంచనాలో వేస్తున్నారు. 

అయితే వైసీపీ ఇప్పుడు మంగళగిరిలో వర్గాలుగా చీలిపోయింది. ఎమ్మెల్యే ఆర్కే, దొంతిరెడ్డి వేమారెడ్డి, గంజి చిరంజీవి వర్గాలుగా శ్రేణులు విడిపోయారు. ఆర్కే వైసీపీని వీడినప్పటికీ.. ఆయన వర్గం చెక్కుచెదరకుండా వుంది. అయితే రామకృష్ణారెడ్డి వర్గాన్ని అణగదొక్కి తన పరపతిని చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో చేరి, అనతి కాలంలోనే ఇన్‌ఛార్జ్‌గా ఛాన్స్ కొట్టేసిన చిరంజీవి సైతం పార్టీలో తనకు ఎదురులేకుండా చూసుకోవాలని పావులు కదుపుతున్నారు . మంగళగిరిలో ఎవరికి వారే అన్నట్లుగా వున్న వైసీపీని తిరిగి ఏకతాటిపైకి తెచ్చేందుకు విజయసాయిరెడ్డి, మర్రి రాజశేఖర్‌లు 3 గ్రూపుల్ని సమావేశపరిచారు. 

గొడవలు, మనస్పర్ధలు పక్కనబెట్టాలని వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని విజయసాయిరెడ్డి సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ సముచిత గౌరవం లభిస్తుందని, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఆయన హితవు పలికినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనలో మనకి గోడవలు ప్రత్యర్ధికి బలాన్ని పెంచుతాయని విజయసాయిరెడ్డి సూచించారట. మరి ఆయన చర్యలు మంగళగిరి వైసీపీలో నేతల మధ్య సయోధ్యను కుదుర్చుతుందా లేదా అనేది చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios