వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు కమల. అప్పటి నుంచి ఆమె అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్దినెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లోని ఆశావహులుతమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టికెట్ వస్తుందన్న భరోసా వుంటే ఓకే.. లేనిపక్షంలో పార్టీ మారేందుకు కూడా కొందరు వెనుకాడటం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. ముఖ్యంగా అధికార వైపీపీకి చెందిన పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీ, జనసేన నేతలతో టచ్‌లో వున్నారు. తాజాగా వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కమల హాజరుకావడం రాజధాని ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీలో వుండి జనసేన పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్లడం ఏంటంటూ చర్చ నడుస్తోంది. త్వరలోనే కాండ్రు కమల జనసేనలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది.
మంగళగిరిలో బలంగా వున్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కాండ్రు కమల కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడంతో ఆమె రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలో చేరి టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం మంగళగిరి సీటును నారా లోకేష్‌కు కన్ఫర్మ్ చేయడంతో కమల నిరాశకు లోనయ్యారు. అయితే 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆమె అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఏ కార్యక్రమానికి కమల హాజరుకావడం లేదు.
