మూడో పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి... రెండో భార్యను చిత్ర హింసలు పెట్టిన సంఘటన  కడప జిల్లా రైల్వే కోడూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... రైల్వేకోడూరు పట్టణంలోని పాతబజారుకు చెందిన యాదాల ప్రసాద్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి 1999లో నెల్లూరు జిల్లా గూడురుకి చెందిన సుధ అనే మహిళతో వివాహం జరిగింది.

కాగా.. ఆమెకు విడాకులు ఇచ్చి.. 2013లో  ప్రణీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం భార్యతో ప్రేమగా ఉన్న ప్రసాద్.. తర్వాతి నుంచి ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టారు. రకరకాలు గా చిత్ర హింసలు పెడుతున్నా ఆమె భరిస్తూ వచ్చింది. ఇటీవల  తాను మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు భార్యకి చెప్పి.. ఆమె గొంతుకు చున్నీ వేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు.

అతని భారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గొంతుకి చున్నీవేసి బిగించడంతో గాయమవ్వడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.