తనను మందలించాడని సొంత బాబాయి పై కక్ష పెంచుకున్నాడు. ఆ కోపాన్ని బాబాయి కొడుకు మీద తీర్చుకున్నాడు. నమ్మించి తీసుకువెళ్లి అతి కిరాతకంగా  కత్తితో పొడిచి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.  ఈ దారుణ సంఘటన కడప  జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...కడప జిల్లా వల్లూరు మండలం గోసులవారి పల్లె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి(30) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం బెంగళూరులో ఉంటున్నాడు. ఇతను సోమవారం రాత్రి ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయంలో ఇంటి వద్ద రాత్రి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాబాయి రామసుబ్బారెడ్డి మంగళవారం ఉదయం భాస్కర్‌రెడ్డిని మందలించాడు.

Also Read మంటల్లో చిక్కుకున్న కావేరి ట్రావెల్స్ బస్సు... రూ.20లక్షల నగదు బూడిదపాలు...

అది మనసులో పెట్టుకొని బాబాయి కుమారుడిపై కక్ష తీర్చుకోవాలని భావించాడు. పెండ్లిమర్రి మండలం వెల్లటూరులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న నందకిశోర్‌రెడ్డి వద్దకు వెళ్లి బంధువుల ఇంటికి వెళ్దాం పద అంటూ ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని వచ్చాడు. కొత్తగంగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో నందకిషోర్‌రెడ్డిని  రోడ్డుపై పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న కొడవలితో మెడపై నరికాడు. 

AlsoRead ప్రేమ పెళ్లి.. మోజు తీరాక.. మరో యువతితో.....

బాలుడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడని భావించి బాబాయికి ఫోన్‌ చేసి మీ కొడుకును కొత్తగంగిరెడ్డిపల్లె వద్ద చంపానని చెప్పి పారిపోయాడు. రామసుబ్బారెడి సంఘటన స్థలానికి వచ్చే సరికి కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.