ప్రేమించానని వెంట పడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నిజమనుకొని ఆ యువతి అతని వెంట ఏడు అడుగులు వేసింది. ఇద్దరు బిడ్డలు పుట్టాక... అతనికి ఆమెపై మోజు తీరింది. దీంతో... ఆమెను వదిలేసి రెండో పెళ్లి  చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....  నెల్లూరు నవాబ్ పేటకు చెందిన ఓ మైనర్ బాలిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. తన స్నేహితురాలు బంధువుల వివాహానికి వలేటివారి పాలెం మండలం శింగమనేనిపల్లి గ్రామానికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన వెంకట సురేంద్ర అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

బాలికకు మాయమాటలు చెప్పి... మూడేళ్ల క్రితం వెంకట సురేంద్ర చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి అక్కడకు తీసుకొని వెళ్లి వివాహం చేసుకున్నారు.అనంతరం కావలి, ఒంగోలు, కందుకూరులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా జన్మించిన బిడ్డ మృతి చెందింది. రెండవ సారి మరో బిడ్డకు జన్మనించింది. ఆ తర్వాత సురేంద్ర పెట్టే చిత్రహింసలు ప్రారంభమైయ్యాయి. 

వేధింపులు తాళలేక యువతి నెల్లూరులోని అమ్మమ్మ వద్ద ఉంటుంది. తాజాగా సురేంద్ర నాలుగు రోజుల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి మొదటి భార్య సురేంద్ర ఇంటికి వెళ్లి తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని కోరింది. సురేంద్ర, అతడి కుటుంబసభ్యులు బెదిరించడంతో ఆమె సోమవారం మహీధర్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే డీఎస్పీ రవిచంద్రను కలిసి సురేంద్రపై చట్టపరమైన చర్యలు తీసుకుని, బాధితురాలకి న్యాయం చేయాలని సూచించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.