అన్న భార్య.. వదినని తల్లితో సమానంగా చూసే సమాజం మనది. అలాంటి సమాజంలో ఉండి.. ఓ వ్యక్తి వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త.. అన్నకు తెలియడంతో తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.  తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ దారుణ సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం అజ్జంపూడిలో చోటుచేసుకుంది.

Also Read ఘోర రోడ్డు ప్రమాదం... ఒకరు సజీవదహనం..

పూర్తి వివరాల్లోకి వెళితే.. అజ్జంపూడిలో నివసించే ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఇంటి సమీపంలోనే వరసకు తమ్ముడయ్యే వ్యక్తి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అన్న భార్య తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా వారు తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. కాగా.. చివరకు విషయం అతనికి తెలిసిపోయింది.

తన భార్యతో తమ్ముడు సంబంధం పెట్టుకోవడాన్ని భరించలేకపోయాడు. ఆవేశంతో ఊగిపోయిన ఆయన.. పలు మార్లు తమ్ముడిని హెచ్చరించాడు. అయినా అతని తీరు మారకపోవడంతో ఎలాగైనా సోదరుడిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

తీవ్రగాయాలపాలైన అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.