వివాహేతర సంబంధం ఓ మనిషి ప్రాణాలు తీసింది. తన ప్రియురాలితో సరదాగా గడపాలని వెళ్లిన వ్యక్తి చిన్న గొడవ కారణంగా హత్యకు గురయ్యాడు.
చిత్తూరు : వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాన్నిబలి తీసుకున్న సంఘటన చిత్తూరు నగరంలో గురువారం వెలుగు చూసింది. వన్టౌన్ సీఐ నరసింహరాజు కథనం మేరకు, పుంగనూరుకు చెందిన ఈశ్వర్ రెడ్డి (50)భార్యకు దూరంగా ఉంటున్నాడు. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఆయన కూరగాయలు, తినుబండారాలు అమ్ముతూ జీవిస్తున్నాడు. ఈయనకు యాదమరికి చెందిన లలితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో బుధవారం వీరిద్దరూ సుందరయ్య వీధిలోని లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత డబ్బుల విషయంలో వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కోపంతో లలిత ఈశ్వర్ రెడ్డిని నెట్టేయడంతో ఆయన తలకు తీవ్ర గాయమై అక్కడే మృతి చెందాడు. అదేమీ పట్టించుకోని లలితా.. తాపీగా..గురువారం ఉదయం గది తాళాలు వేసి రిసెప్షన్లో ఇచ్చి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం లాడ్జ్ ని శుభ్రం చేయడానికి సిబ్బంది గది తెరిచి చూడగా ఈశ్వర్ రెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఆ తరువాత అక్కడి పరిస్థితులను పరిశీలించిన పోలీసులు.. ఈశ్వర్ రెడ్డి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లాడ్జి గదిని లలిత పేరు మీద బుక్ చేయడంతో పోలీసులు పని సులభమైంది. ఆమె ఇచ్చిన చిరునామా, ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కోత్తగిరిలో 45 రోజులకు ముందు అదృశ్యమైన వివాహేతర జంట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతదేహాలుగా కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లా కోత్తగిరి సమీపంలోని వెల్లెరి కొల్లంకు చెందిన శరవణన్ (25)కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొన్నూరు సాపంకరై గ్రామానికి చెందిన సుమతి (23)తో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధం బయటకు తెలియడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో గత 45 రోజులకు ముందు ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. బంధువులు వారికోసం గాలించిన ఆచూకీ తెలియరాలేదు
ఈ క్రమంలో ఆదివారం వెళ్లిరి కొల్లం అటవీ ప్రాంతంలో ప్రజలు వెళుతున్న సమయంలో కుళ్ళిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వారి ఆధార్ కార్డు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మృతదేహాల వద్ద దొరికిన లెటర్ లో తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. ఆ తర్వాత మృతదేహాలను కోత్తగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణలో మృతదేహాలు శరవణన్, సుమతివిగా నిర్ధారించారు.
