Asianet News TeluguAsianet News Telugu

భార్యపై కోపం.. కుమార్తెలను కొడుతూ, చంపేస్తానని కత్తితో బెదిరిస్తూ, వీడియోతీసి ఓ తండ్రి రాక్షసానందం...

భార్యమీది కోపంతో రాక్షసుడిలా మారాడో భర్త. చిన్నపిల్లలు.. తాను కన్న పిల్లలు అని కూడా చూడకుండా.. కూతుర్లపై పాశవికంగా ప్రవర్తించాడు. అదంతా వీడియో తీసి భార్యకు పంపి.. వికృతంగా వ్యవహరించాడు.

man harassment to daughter over angry on wife in west godavari
Author
First Published Sep 16, 2022, 6:45 AM IST

పశ్చిమగోదావరి : భార్యపై కోపంతో ఉన్మాదిలా మారాడో భర్త.. కన్నబిడ్డలు అని కూడా చూడకుండా చిన్నారులను చిత్రహింసలకు గురిచేశాడు. పైగా, ఆ దృశ్యాలను వీడియో తీసి భార్యకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు భార్య నిర్మల. వీరికి 11, 9 ఏళ్ళ వయసున్న ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన దావీదు ఏ పని చేయకుండా తిరిగే వాడు.

భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో.. ఆమె పిల్లలను భర్త వద్ద వదిలి జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్ళింది. పిల్లలను తీసుకుని దావీదు ఇటీవల పెంటపాడుకు మకాం మార్చాడు. భార్యను ఎలాగైనా దుబాయ్ నుంచి రప్పించాలని ఉద్దేశంతో కుమార్తెలను విచక్షణారహితంగా కొడుతూ.. చంపేస్తానని కత్తితో బెదిరిస్తూ.. వారు భయంతో కేకలు వేస్తుంటే ఆ దృశ్యాలను కొడుకుతో వీడియో తీయించి ఆమెకు పంపడం మొదలు పెట్టాడు.

అల్లూరి జిల్లాలో దంపతుల సూసైడ్: మృతులు హైద్రాబాద్ కు చెందినవారిగా గుర్తింపు

అది చూసి ఆమె తల్లడిల్లిపోయింది. వాటిని ఆమె తమ గ్రామంలోని సర్పంచ్ కి పంపించింది. ఆయన వెంటనే పోలీసులకు తెలియజేశారు. తాడేపల్లిగూడెం గ్రామీణ సిఐ మూర్తి, ఎస్సై  జి సత్యనారాయణ గ్రామానికి చేరుకున్నారు. పిల్లలను విచారించారు. విచారణలో తండ్రి హింసించేది నిజమే అని తేలింది. దీంతో వారి నుంచి సేకరించిన వివరాల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో భర్త కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే గత అక్టోబర్ లో తమిళనాడులో జరిగింది. తమిళనాడు నెర్కుండ్రలో భార్యపై కోపంతో నాలుగు బైకులకు, ఓ కారుకు నిప్పు పెట్టి దగ్ధం చేసిన ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై నెర్కుండ్రం షణ్ముఖనగర్ సత్యం వీధిలో సెప్టెంబర్ 25న ఒక కారు, నాలుగు బైకులు నిప్పు అంటుకుని దగ్ధమయ్యాయి. దీని మీద బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యభర్తల మధ్య వివాదాలు మామూలే. గొడవలు సర్దుబాట్లూ మామూలే కానీ..  భార్యమీది కోపంతో ఏకంగా ఇరుగుపొరుగు వారికీ నష్టం కలిగించాడో వ్యక్తి. 

దీంతో అటు వైవాహిక జీవితం సర్దుకోలేదు సరికదా.. ఇటు ఈ వ్యక్తి నిందితుడిగా మారి.. జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే సతీష్ (26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై అంబత్తూరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సతీష్ 2019లో భార్య వెండామనితో విడిపోయాడు. అప్పటినుంచి తల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య అతనికి తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో విరక్తి చెంది.. భార్య వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ మంటలు విస్తరించి సమీపంలోని కారు, నాలుగు బైకులు దగ్ధం అయ్యాయి. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ విషయం స్థానికంగా సంచలనం కలిగించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios