ఓ జనసేన నేత మోసానికి కిరాణా వ్యాపారి బలయ్యాడు. రూ. 16లక్షలు తీసుకుని అతని పిల్లలకు స్కూల్లో సీటిప్పిస్తానని ఇప్పించలేదు. డబ్బులు తిరిగివ్వలేదు.
శ్రీకాకుళం : ఆంధ్ర ప్రదేశ్ లో ఓ జనసేన నాయకుడి మోసానికి అమాయకుడైన కిరాణా వ్యాపారి బలయ్యాడు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడీ కంచరాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనసేన నాయకుడైన గురివిందల అసిరి నాయుడు ఓ కిరాణా వ్యాపారిని మోసం చేశాడు. అది తట్టుకోలేని అతను ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కథనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఈ మేరకు తెలిపారు…
బుడ్డెపు రామకృష్ణ (43) అనే వ్యక్తి విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాక నివాసి. అతను తన గ్రామంలోనే కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి సైనిక్ స్కూల్లో సీట్లు ఇప్పిస్తానని 20020లో జనసేన నాయకుడు గురివిందల అసిరి నాయుడు రామకృష్ణను నమ్మించాడు. దీనికోసం రామకృష్ణ.. అసిరి నాయుడుకి రూ.16 లక్షల రూపాయలు ఇచ్చాడు.
మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం.. మనస్థాపంతో భార్య ఆత్మహత్యాయత్నం..
కానీ, సైనిక్ స్కూల్లో రామకృష్ణ పిల్లలకు సీట్లు రాలేదు. పిల్లల భవిష్యత్తు కోసం అప్పుచేసి మరి రూ. 16 లక్షల డబ్బులు అసిరినాయుడుకు ఇచ్చాడు. దీంతో సీట్లు రాలేదు కాబట్టి తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని అడిగాడు. కానీ, అసిరి నాయుడు రామకృష్ణను పట్టించుకోలేదు. రోజులు గడుస్తున్నా అసిరినాయుడు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎన్నిసార్లు అడిగినా అసిరినాయుడు డబ్బులు ఇవ్వకపోగా అసలు ఏమీ మాట్లాడడం లేదు.
దీంతో ఈ మార్చి 31న రామకృష్ణ తన భార్యతో కలిసి అసిరినాయుడు ఇంటికి వెళ్ళాడు. పిల్లల భవిష్యత్తు కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయని.. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని కోరాడు. లేకపోతే తను ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పాడు. ‘దీంతో అసిరినాయుడు నీకు నచ్చినట్లు చేసుకో అని…రెచ్చిపోయాడు. మనస్థాపం చెందిన రామకృష్ణ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు అక్కడే తాగేశాడు.
వెంటనే అతడిని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందించారు. మూడు రోజులకే చికిత్స ఖర్చు రూ.3.50లక్షలు అయ్యింది. అంతవరకు భరించగలిగిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత డబ్బులు పెట్టలేకపోవడంతో రామకృష్ణను శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రామకృష్ణ శనివారం రాత్రి మృతి చెందాడు. దీనిమీద రామకృష్ణ భార్య పొందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జనసేన నాయకుడు గురివిందల అసిరి నాయుడు గురించి కంచరాం గ్రామస్తులు మోసాలకు పాల్పడుతుంటాడు అని చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తుంటాడని అన్నారు. నరసన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గతంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. పది లక్షల తీసుకున్నాడని తెలిపారు. అతడికి ఉద్యోగం రాకపోవడంతో రూ. ఐదు లక్షల తిరిగి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అతడు ఒక్కడే కాదని శ్రీకాకుళం చెందిన వ్యక్తి దగ్గర రూ. 15 లక్షలు, కొత్తూరుకు చెందిన వ్యక్తి దగ్గర రూ. మూడు లక్షలు తీసుకొని మోసం చేశాడని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఒకసారి గ్రామస్తులు దేహశుద్ధి కూడా చేశారని చెప్పుకొచ్చారు.
