మన దగ్గర నమ్మకం పనిచేసి.. కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటూ.. యజమాని క్షేమాన్ని కోరే నమ్మకస్తులు దొరకడం అదృష్టం. అయితే నమ్ముకున్న యజమానే.. అతని పట్ల కాలయముడయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లెకు చెందిన సీజే భాస్కర్‌రెడ్డి ఇంట్లో ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన వడ్డే సుబ్బారాయుడు ఇరవై ఏళ్లుగా పాలేరుగా పనిచేస్తున్నాడు.

ఇతను దివ్యాంగుడు, చెప్పుకోవడానికి నా అనేవాళ్లు ఎవరు లేరు. దీంతో అతని ప్రాణాలను ఎరగా వేసి డబ్బు సంపాదించాలని యజమాని భాస్కర్‌రెడ్డికి దుర్బుద్ధి పుట్టింది. దీనిలో భాగంగా నంద్యాలకు చెందిన న్యాయవాది మహేశ్వరరెడ్డి, అవుకు గ్రామానికి చెందిన షేక్షావలి, హోటల్ రమణ అనే వ్యక్తులతో కలిసి కుట్రపన్నాడు.

2015 నవంబర్‌లో హైదరాబాద్‌కు చెందిన న్యూశ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు మల్లేశ్, శర్మలను కలిసి సుబ్బారాయుడి పేరు మీద రూ.లక్షలకు ఒక పాలసీ, రూ.15 లక్షలకు మరో పాలసీ చేయించారు.

పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే డబుల్ పరిహారం లభించే పాలసీలివి. పథకం ప్రకారం భాస్కరరెడ్డి 2015 డిసెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున పొలానికి వెళ్దామంటూ సుబ్బారాయుడిని తీసుకెళ్లి మార్గమధ్యంలో మరికొందరితో కలిసి గొంతునులిమి చంపాడు.

హత్యపై ఎవరికి అనుమానం రాకుండా సుబ్బారాయుడి తలపై ట్రాక్టర్‌ను ఎక్కించి ప్రమాదంగా చిత్రీకరించాడు. ఆ తర్వాత భాస్కరరెడ్డి.. వడ్డే భాస్కర్‌గా భోగస్ ఓటర్ కార్డు పొందాడు. సుబ్బారాయుడు తన తమ్ముడని నామినీగా ఉన్నాడంటూ భీమా కంపెనీ ప్రతినిధులను నమ్మించి.. మొత్తం రూ. 32 లక్షల పరిహారాన్ని పొందాడు.

ఆ తర్వాత ఈ సొమ్మును నిందితులంతా పంచుకున్నారు. ఈ విషయం ఆ నోటో ఈ నోటా జిల్లా ఎస్పీ దృష్టికి రావడంతో సీసీఎస్ పోలీసులు భాస్కరరెడ్డితో పాటు హత్యకు సహకరించిన షేక్షావలి, జీనుగ వెంకటకృష్ణ, జీనుగ శివశంకర్‌ను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

వీరితో పాటు పరారీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి, హోటల్ రమణ, లాయర్ మహేశ్వర్‌రెడ్డితో పాటు ఇన్సూరెన్స్ ఏజెంట్లు మల్లేశ్, శర్మ‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.