అప్పటికే నలుగురిని వివాహం చేసుకున్నాడు. అయినా అతనికి అమ్మాయిలపై మోజు తీరలేదు. మరో యువతిపై కన్నేశాడు. ఆమెను ఐదో వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే అందుకు ఆ యువతి అంగీకరించలేదు. దీంతో పగపట్టి.. వేధించాడు. అయినా ఒప్పుకోకపోవడంతో కొడవలితో దాడి చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పట్టణంలోని ఆంజనేయనగర్ కు చెందిన శంకర్, జయమ్మ దంపతుల  పెద్ద కుమార్తె భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటుంది. తండ్రి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో... ఆమె ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె బెంగళూరులో ఉన్న తన మేనత్త ఉమ ఇంట్లో ఉంటూ అక్కడే ఉద్యోగం చేస్తూ... కుటుంబాన్ని పోషిస్తోంది.

అయితే... ఉమ భర్త రంగనాగరాజు కి అప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. అతని కన్ను తాజాగా వనితపై పడింది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అందుకు ఆమె నిరాకరించింది. అతని వేధింపులు తీవ్రం కావడంతో... బెంగళూరు వదిలి స్వగ్రామానికి చేరుకుంది. ఇక్కడే ఓ కంపెనీలో సేల్స్ గర్ల్ గా చేరింది. ఆమె పత్తికొండలో ఉంటున్న విషయం తెలుసుకున్న రంగనాగరాజు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి కొడవలితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.