అతనికి పెళ్లైంది. ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. అతని కన్ను మాత్రం భార్య చెల్లెలిపైనే ఉంది. కట్టుకున్న భార్యను సక్రమంగా చూసుకోకుండా.. ఆమె చెల్లిలి పై ఆశ పడ్డాడు. మరదిలిని కూడా తనకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అయితే.. అందుకు సదరు యువతితోపాటు.. ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరించలేదు. కాగా.. ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. దీంతో.. అక్కసు పెంచుకొని యువతి నిద్రపోతుండగా.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా గట్టుకిందపల్లె గ్రామానికి చెందిన కదిరి శివన్న, కదిరి నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె మాధవికి కర్ణాటక రాష్ట్రం బేళూరుకు చెందిన వెంకటేష్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. మూడో కుమార్తె కదిరి సుమతి(24) మదనపల్లె ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. ఎనిమిది నెలల క్రితం వెంకటేష్‌ తనను వివాహం చేసుకోవాలని సుమతిని వేధించాడు.

బావ వేధింపులు తట్టుకోలేక సుమతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ప్రాణాలతో బయటపడింది.  ఆ సమయంలో వెంకటేష్ కి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో.. భార్య , కొడుకును వదిలేసి వెళ్లిపోయాడు. ఇటీవల సుమతికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయించారు. 

ఈ నెల 25న వివాహం చేయాలని ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇది తెలుసుకున్న వెంకటేష్‌ ఆగ్రహంతో రగిలిపోయాడు. తన మరదలిని కడతేర్చాలని నిశ్చయించుకున్నాడు. మంచంపై నిద్రపోతున్న సుమతి(24)పై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెట్రోల్‌పోసి నిప్పంటించి పారిపోయాడు. మంటలకు సుమతి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మంటలు ఆర్పారు. ముఖం మినహా మిగతా శరీర భాగాలు తీవ్రంగా కాలాయి. ప్రస్తుతం చావు బతుకులతో పోరాడుతోంది. ఇదిలా ఉండగా.. సుమతిని చంపేందుకు వెంకటేష్ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఇంటి వద్ద పెంపుడు కుక్కలు ఉండడంతో అవి తనను చూస్తే అరిస్తే ప్లాన్‌ బెడిసి కొడుతుందనే ఉద్దేశంతో అతడు అన్నంలో విషం కలిపి ఇంటి చుట్టూ వేశాడు. ఆ అన్నం తిని మూడు కుక్కలు, ఒక పిల్లి మృతిచెందాయి. ఉదయం ఆ అన్నం తిన్న మరో 30 కోళ్లు సైతం మృతి చెందాయి.