జగిత్యాల:  అనారోగ్యంతో  బాధపడుతున్న తల్లిని ఓ వ్యక్తి  స్మశాన వాటికలో వదిలి వెళ్లాడు.  ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు అంబులెన్స్‌లో ఆ వృద్దురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని  వీక్లి బజార్ లో చెట్‌పల్లి నర్సమ్మ అనే  వృద్దురాలు అనారోగ్యంతో  బాధపడుతోంది. ఆమె భర్త 30 ఏళ్ల క్రితమే మృతి చెందాడు.  కొడుకు ధర్మయ్య వద్దే ఆమె ఉంటుంది. 

ధర్మయ్య అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న  నర్సమ్మ చనిపోతే ఇంటి యజమానితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని దర్మయ్య భావించాడు. తల్లిని బతికుండగానే స్మశానవాటికలో వదిలివెళ్లాడు.

వృద్దురాలి దీన పరిస్థితిని చూసిన స్థానికులు కొందరు చలించిపోయారు. వెంటనే వారు అంబులెన్స్ కు ఫోన్ చేశారు.  అంబులెన్స్ లో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నర్మమ్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది.