కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో జరిగిన యువతి దారుణ హత్యపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవిక కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో జరిగిన యువతి దారుణ హత్యపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువతి దేవిక కుటుంబానికి అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక, యువతి దేవిక కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నిందితుడిని దిశ చట్టం కింద శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. గడువులోగా విచారణ పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలని చెప్పారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

యువతి దేవిక హత్య గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు దేవిక స్వగ్రామం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కె గంగవరం. కరప మండలం కూరాడ గ్రామంలోని అమ్మమ్మ కొప్పిశెట్టి చంద్రమ్మ వద్ద ఉంటూ డిగ్రీ పూర్తి చేసింది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తుంది. మరోవైపు రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ. కూడా కూరాడలోని తన అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేశారు. 

వారిద్దరి పెళ్లిని జరిపించాలని కుటుంబ సభ్యులు అనుకున్నప్పటికీ అది కుదరలేదు. సూర్యనారాయణకు తమ కూతురిని ఇచ్చేందుకు దేవిక కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ క్రమంలోనే దేవిక కానిస్టేబుల్ ఉద్యోగ సన్నాహకాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. సూర్య నారాయణకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. దేవిక మరొకరితో సన్నిహితంగా తిరుగుతున్నట్లు సూర్యనారాయణ అనుమానించాడు. తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దేవిక కదలికలపై నిఘా ఉంచాడు. 

సూర్యనారాయణ ఆమెపై దాడి చేసేందుకు యాసిడ్ బాటిల్, కత్తిని కొనుగోలు చేసిశారు. శనివారం జి మామిడాల నుంచి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి చేశాడు. పెదపూడి మండలం కూరాడ-కాండ్రేగుల రహదారిపై శనివారం పట్టపగలు దేవిక బైక్‌ను అడ్డగించి ఆమె గొంతు కోశాడు. ఇది గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. అది ఘటన స్థలానికి చేరుకునేలోపే బాలిక మృతి చెందింది. దేవికపై దాడి చేసిన వెంటనే స్థానికులు నిందితుడిని పట్టుకుని కట్టేసి కొట్టారు. అనంతరం పెదపూడి పోలీసులకు సమాచారం అందించగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను విడిచిపెట్టబోమని, దిశ చట్టం ప్రకారం విచారణ వేగవంతం చేస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు.