భార్యపై అనుకోకుండా అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం రోజురోజుకీ పెరిగిపోయింది.చివరకు భార్య తలపై రోకలిబండతో కొట్టి..  హతమార్చాడు. ఈ సంఘటన తిరువూరులో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే యరమల నర్సిరెడ్డి, నాగమణి(30) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై నర్సిరెడ్డికి అనుమానం ఉంది. భార్యభర్తలిద్దరూ తరచూ గొడవపడేవాళ్లు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఉన్న నర్సిరెడ్డి పక్కనే ఉన్న రోకలిబండ తీసుకొని నాగమణి తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. కొద్దిసేపటికే ఆమె సంఘటనా స్థలంలోనే కన్నుమూసింది. సమాచారం అందుకున్న సీఐ శేఖర్ బాబు, ఎస్సైలు సుబ్రహ్మణ్యం, అవినాశ్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్సిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.