ఆస్తి కోసం ఏడేళ్ల బాలుడిని అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చీగలపల్లె గ్రామానికి చెందిన వెంకటప్ప, పాపమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా.. కుమారుడు వెంకటాచలపతి(7) రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉగాది పండగ కావడంతో గ్రామ దేవతల పూజల కోసం వెంకటాచలపతి తన స్నేహితులతో కలిలసి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు వెతకగా.. మొక్కజొన్న చేను సమీపంలో శవమై కనిపించాడు.

కాగా.. తొలుత అందరూ ప్రమాదంగానే భావించారు. అయితే.. తర్వాత వెంకటప్పకు తమ కుమార్తె భర్త( అల్లుడు) రాఘవేంద్రపై అనుమానం కలిగింది. ఇతను ఇటీవల వ్యాపారం నిమిత్తం బాగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు పిల్లనిచ్చిన మామ వెంకటప్పను డబ్బులు అడగగా ఇవ్వనని తేల్చి చెప్పాడు.

కూతురికి పెళ్లి చేసేశామని.. మిగిలిన ఆస్తి మొత్తం తమ కుమారుడు వెంకటాచలపతి కే దక్కుతుందని తేల్చి చెప్పాడు. దీంతో.. బావమరిదిని చంపేస్తే.. ఆస్తి మొత్తం తన భార్యకు దక్కుతుందని భావించాడు. పథకం ప్రకారం మొక్కజొన్న చేనుకి తీసుకువెళ్లి.. అక్కడ రాయితో మోది హత్య చేశాడు. అనంతరం ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి.. తాను చేసిన నేరం అంగీకరించాడు.