పిల్లనిచ్చిన మామ గొంతు కోసి  అల్లుడే అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  కొత్త పేట, లాలిమబార్ అండ్ రెస్టారెంట్ సమీపంలోని గున్నాబత్తుల అచ్చయ్యవీధిలో చింతపల్లి సాంబశివరావు(70) పార్వతి దంపతులు నివాసం ఉంటున్నారు.

వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె సావిత్రిని ఊర్మిళానగర్ కు చెందిన కెల్లా ప్రభాకర్ కు ఇచ్చి వివాహం చేశారు. అతను గతంలో రైల్వే గ్యాంగ్ మెన్ గా పనిచేసేవాడు. ప్రస్తుతం ఉద్యోగం పోయి పని లేకుండా తిరుగుతుండడంతో మామే కూరగాయల దుకాణం పెట్టించాడు. దానిని కూడా సరిగా నిర్వహించలేకపోయాడు. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బందలుపడేవారు. దాని వల్ల భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడం మొదలయ్యాయి.

దీంతో.. సావిత్రి భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చింది. తన భార్యను తనకు పంపించాలంటూ ప్రభాకర్ మామ ఇంటికి వచ్చి అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 4గంటల సమయంలో ప్రభాకర్ అత్తింటికి వచ్చాడు. 

ఆ సమయంలో స్నానం చేసి వచ్చి దేవుడుకి దండం పెట్టుకుంటున్న సాంబశివరావుని వెనక నుంచి గొంతు కోసి ప్రభాకర్ హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సాంబశివరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.