భార్య భర్తల మధ్య నెలకొన్న వివాదం చివరకు ఓ నిండు ప్రాణం పోయేలా చేసింది. బావను సొంత బావమరిది అతి దారుణంగా హత్యచేశాడు. ఈ సంఘటన అమరావతిలోని ఇంటూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంటూరు గ్రామానికి చెందిన కుంచాల అంకమరావుకు ప్రకాశం జిల్లా చీరాల మండలం, ఈపూరుపాలేనికి చెందిన పల్లెపు శ్రీను కుమార్తె లక్ష్మీ తిరుపతమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.

అంకమరావు కూలీనాలి చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. కొంతకాలం అన్యోన్యంగా ఉన్నవారి మధ్య ఇటీవల వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో.. అప్పుడప్పుడు గొడవలు పడేవారు. మూడు సంవత్సరాల నుంచి దంపతులు ఇద్దరూ పలు ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా రెండు నెలల క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. అయితే.. చేసుకోవడానికి కూడా పనులు లేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలో దంపతుల మధ్య మరోసారి గొడవ చోటుచేసుకుంది. దీంతో.. లక్ష్మీ తిరుపతమ్మ ఆవేశంలో పరుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అయితే.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో.. ప్రాణాపాయం నుంచి బయటపడింది. తన సోదరి ఇలా చావు, బతుకుల మధ్య కొట్టుకోవడం చూసి లక్ష్మీ తిరుపతమ్మ సోదరుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే ఈ విషయంలో బావ అంకమరావుతో గొడవ పడ్డాడు.

ఆ గొడవ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆవేశంలో బావ అంకమరావుపై బావమరిది వెంకటేష్ కత్తితో దాడి చేశాడు. దీంతో.. అంకమరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.