కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిఠాపురంలోని విద్యుత్ నగర్‌లో ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హత్య చేశాడు. అత్తపై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు యత్నించిన మామ, బావమరిదిపై కూడా అతడు కత్తితో దాడి చేశాడు.

కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిఠాపురంలోని విద్యుత్ నగర్‌లో ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హత్య చేశాడు. అత్తపై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు యత్నించిన మామ, బావమరిదిపై కూడా అతడు కత్తితో దాడి చేశాడు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. పిఠాపురంకు చెందిన రమణమ్మ కూతురు దివ్యకు కందరడ గ్రామానికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అల్లుడు రమేష్. బుధవారం ఉదయం రమణమ్మపై రమేష్ కత్తితో దాడి చేశాడు. 

ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రమణమ్మ వరండా శుభ్రం చేసేందుకు బయటకు వచ్చిన సమయంలో చీకట్లో దాక్కున్న రమేష్ ఒక్కసారిగా కత్తితో ఆమెపైకి దూసుకెళ్లి విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో ఆమె గట్టిగా అరించింది. ఈ అరుపులు విన్న రమణమ్మ భర్త సత్యనారాయణ, కొడుకు దిలీప్ అక్కడికి చేరుకున్నారు. రమేష్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రమేష్ వారిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఘటన స్థలానికి చేరుకున్న కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి వి భీమారావు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

పెళ్లయిన ఐదేళ్ల తర్వాత కూడా పై చదువుల పేరుతో తన భార్యను అత్తమామలు వారి వద్దే ఉంచుకోవడంపై నిందితుడు వారిపై పగ పెంచుకున్నట్లు సమాచారం. నిందితుడు రమేష్ ఎం ఫార్మా పూర్తి చేశాడు. అతడి భార్య బిటెక్ పూర్తిచేసింది. టెక్నికల్ కోర్సు కోసం ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది. దీంతో వారి నాలుగేళ్ల కొడుకును భార్య తల్లిదండ్రుల వద్ద ఉంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా రమేష్‌కు తన భార్య దివ్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు అత్త రమణమ్మ కారణమని రమేష్ భావిస్తున్నాడని.. ఈ నేపథ్యంలోనే ఆమెపై కోపం పెంచుకుని హత్య చేశాడని తెలుస్తోంది.