భర్తను కాదని మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ప్రియుడితో పరారయ్యింది. రెండు నెలల తర్వాత ఆమెపై ప్రియుడికి మోజు తీరింది. ఇక ఆమెతో అవసరం లేదని భావించి ఆమెను కడతేర్చాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండపలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మండలంలోని పీవీ పురంకు చెందిన భాను అనే మహిళకు పది సంవత్సరాల క్రితం రాయలచెరువుకు చెందిన ముని శేఖర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. కాగా... కొంత కాలం క్రితం భాను కి అదే మండంలోని రామాపురం గ్రామానికి చెందిన హరి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. సరిగ్గా రెండు నెలల క్రితం భాను.. భర్త, కుమార్తెను కాదని హరితో లేచిపోయింది.

విషయం తెలియని భర్త ముని శేఖర్.. భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు నెలల క్రితం కనిపించకుండాపోయిన భాను రెండు రోజుల క్రితం శవమై కనిపించింది. దర్యాప్తు చేపట్టగా.. ప్రియుడు హరి మోజు తీరాక అంతమొందించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. కాగా... భార్య ఇలా శవంగా తేలడంతో మునిశేఖర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.