మూగ బాలికపై అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు... నీచుడికి జీవిత కాల శిక్ష
మూగ బాలికను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి విజయవాడ ఫోక్సో కోర్టు కఠిన శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
విజయవాడ : చిన్నా పెద్ద అని తేడా లేదు... ఆడది అయితే చాలు ఆ మృగాలకు. అభం శుభం తెలియని అమాయక చిన్నారులపై కొందరు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దుర్మార్గులపై ఏమాత్రం కనికరం చూపించకుండా న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధిస్తున్నాయి. ఇలా ఓ మూగ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
విజయవాడకు చెందిన 13ఏళ్ల మూగ బాలికపై ఈ ఏడాది ప్రారంభంలో (జనవరి 19, 2023) గంధం రమేష్ అనే నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎప్పటినుండో మూగ బాలికపై కన్నేసి జనవరి 19న కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతంతో బంధించాడు. అప్పటికే భయపడిపోతున్న బాలికను బెదిరించి వివస్త్రను చేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మాటలు రాని బాలికను తన వికృత చేష్టలతో నరకం చూపించాడు.
అయితే బాలిక తనపై జరిగిన అత్యాచారం గురించి సైగలతో కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసారు. వైద్య పరీక్షల అనంతరం అత్యాచారం జరిగినట్లు నిర్దారించిన పోలీసులు నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేసారు. అతడిపై ఫోక్సో యాక్ట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితులు తప్పించుకునే వీలులేకుండా పక్కా సాక్ష్యాధారాలను సేకరించిన దిశ, సిఎంఎస్ పోలీసులు విజయవాడ ఫోక్సో కోర్టులో సమర్పించారు.
Read More తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్...
మూగ బాలికపై రేప్ కేసును సిరియస్ గా తీసుకున్న ఫోక్సో కోర్టు విచారణను వేగంగా పూర్తిచేసింది. కేవలం తొమ్మిది నెలల్లోనే విచారణను పూర్తిచేసి నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 25మంది సాక్షులను విచారించారు. అలాగే బాలిక మాట్లడలేక పోవడంతో ఇంట్రప్రేటర్ సహాయం వాంగ్మూలం రికార్డ్ చేసారు. మొత్తంగా రమేష్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్దారించింది న్యాయస్థానం. కేసులను,నేరాలను క్రూరమైన ఘటనలుగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఫోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి జీవిత కాలం శిక్ష విధించింది.
ఇదిలావుంటే ఇటీవల ఓ చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆత్మహత్యకు కారణమైన రాజకీయ నాయకుడికి కూడా ఇలాంటి శిక్షే విధించింది ఫోక్సో కోర్టు. విజయవాడకు చెందిన టిడిపి నేత వినోద్ జైన్ భవానీపురంకు చెందిన బాలికను లైంగికంగా వేధించాడు. అతడి వేధింపులు తాళలేక సదరు బాలిక అపార్ట్ మెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో వినోద్ జైన్ ను అరెస్ట్ చేసి ఫోక్సో తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు.
ఈ కేసును విచారించిన విజయవాడ ఫోక్సో కోర్టు వినోద్ జైన్ ను నిందితుడిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అలాగే మూడు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.ఇలా ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షిస్తూ ఇలాంటి నేరాలు జరక్కుండా న్యాయస్థానాలు చర్యలు చేపట్టాయి.