రాత్రి సమయంలో ఒంటరిగా ఇంటికి వెళుతున్న యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం: దిశ, నిర్భయ వంటి కఠిన చట్టాలు... షీటీమ్స్, యాంటి రోమియో రక్షణ చర్యలు... ఇలా ప్రభుత్వాలు, పోలీసులు ఎంతకఠినంగా వ్యవహరించినా దేశంలో మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కొందరు మగాళ్లలో మృగం మేల్కొంటోంది. ఇంటా, బయట, రోడ్డుపై, ఆఫీసుల్లో ఇక్కడ అక్కడని కాదు అన్నిచోట్లా బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు, అపరిచితుల చేతుల్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లా (srikakulam)కు చెందిన యువతిపై తెలిసిన యువకుడే అత్యాచారయత్నానికి (rape attempt) పాల్పడిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగైదు రోజుల క్రితమే అత్యాచారయత్నం జరిగిన భయపడిపోయిన బాలిక ఈ విషయం బయటపెట్టలేదు. అయితే తాజాగా బాధిత యువతి ధైర్యం తెచ్చుకుని పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ అఘాయిత్యం గురించి వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలోని దేవాంగుల వీధిలో ఓ యువతి కుటుంబంతో కలిసి నివాసముంటోంది. ఇదే గ్రామానికి చెందిన చిన్నారావు అనే యువకుడు యువతిపై కన్నేసి ప్రేమ పేరుతో వేధించేవాడు. అతడి ప్రేమను యువతి అంగీకరించకపోవడంతో కోపం పెంచుకుని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. తనను ప్రేమించకున్నా లైంగిక వాంఛ తీర్చాలని... లేకపోతే
అంతుచూస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు.
ఇలా ఎంత భయపెట్టినా, ఎన్ని రకాలుగా వేధించినా యువతి లొంగకపోవడంతో చిన్నారావు దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 12వ తేదీన యువతి పనిపై శ్రీకాకుళం వెళ్ళగా ఈ విషయం ఎలాగో చిన్నారావుకు తెలిసింది. ఇదే అదునుగా భావించి యువతి కోసం కాపుకాసాడు. ఈ క్రమంలోనే రాత్రి 9గంటల సమయలో ఆమె సింగుపురం కొండపోచమ్మ చెరువు వద్ద బస్సుదిగింది. ఒంటరిగా ఇంటికి వెళుతుండగా అప్పటికే అక్కడే కాపుకాసిన చిన్నారావు ఆమెను రోడ్డుపక్కన పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేసాడు.
అయితే ఇదే సమయంలో పలాసవైపు వెళుతున్న ఓ వ్యాన్ లోని వ్యక్తులు యువతి అరుపులు విని ఆపారు. చిన్నారావు నుండి యువతిని కాపాడి ఇంటికి చేర్చారు. అయితే ఈ ఘటనతో భయపడిపోయిన యువతి తనపై జరిగిన అత్యాచారయత్నం గురించి బయటపెట్టలేదు.
నాలుగురోజుల తర్వాత యువతి ధైర్యంచేసి అత్యాచారయత్నం గురించి బయటపెట్టింది. కుటుంబసభ్యులను సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి నుండి నిందితుడి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
