తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ.. ఓ వ్యక్తి వివాహిత ఇంటి ముందు వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజమండ్రికి చెందిన తాటిపాక పెద్దిరాజు.. నాలుగేళ్ల క్రితం గుంటూరు ఉద్యోగం కోసం వేటలో ఉన్నప్పుడు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారడంతో.. ఆ వ్యక్తి పెద్దిరాజు తన ఇంట్లో ఉండటానికి చోటు కల్పించాడు. అయితే.. ఆ సమయంలో ఆ వ్యక్తి భార్యతో పెద్ది రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

గత ఏడాది వారు ఇరువురు ఇంటి నుంచి వెళ్లిపోయి కేరళలో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న భర్త తనకు చిన్న పిల్లలు ఉన్నారని బంధువులతో మహిళకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురానికి తీసుకువచ్చారు. గుంటూరులో నివాసం ఉంటే మరలా పెద్దిరాజు నుంచి ఇబ్బందులు వస్తాయని గమనించిన వారు కాపురాన్ని వినుకొండకు మార్చారు.  

పెద్దిరాజు మరలా వారిని వెతుక్కుంటూ వివాహిత ఇంటికి చేరి వీరంగం సృష్టించాడు. దీంతో వివాహిత, భర్తతోకలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.