ఛోరీ కేసులో అదుపులోకి తీసుకున్న ఓ ఎలక్ట్రీషన్ తెల్లవారేసరికి లాకప్ లో మృతదేహంగా మారిన ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.
విజయనగరం: చోరీ కేసులో అరెస్టయిన ఓ వ్యక్తి లాకప్ లోనే మృతిచెందడం విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ (nellimarla police station) పరిధిలోని శాంతినగర్ నివాసముండే బేతా రాంబాబు ప్రైవేట్ ఎలక్ట్రీషన్ గా పనిచేసేవాడు. అయితే ఇటీవల విజయనగరంలోని ఉపాధి హామీ ఫథకం కార్యాలయంలో జరిగిన బ్యాటరీల చోరీ కేసులో ఇతడిని పోలీసులు అనుమానించారు. ఈక్రమంలోనే నెల్లిమర్ల పోలీసులు రాంబాబును అదుపులో తీసుకుని రాత్రి లాకప్ లో వుంచారు. అయితే శుక్రవారం తెల్లవారేసరికి అతడు లాకప్ లోనే మృతిచెందాడు.
లాకప్ లోనే రాంబాబు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున 4గంటల సమయంలో రాంబాబు ఉరేసుకున్నాడని తెలిపారు. డ్యూటీలో వున్న పోలీసులు ఇది గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ లాకప్ డెత్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఈ ఘటనపై స్పందిస్తూ మెజిస్టీరియల్ విచారణ జరిపించనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రి మార్చురీలో వుంచిన రాంబాబు మృతదేహాన్ని ఆర్డివో భవాని శంకర్ పరిశీలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే రాంబాబు మృతిపై క్లారిటీ రానుంది. పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం లాకప్ డెత్ కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆర్డీవో భవానీ శంకర్ తెలిపారు.
చోరీ కేసులో అనుమానితుడిగా వున్న రాంబాబును పోలీసులు చితకబాదడం వల్లే చనిపోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు చనిపోయాక పోలీసులు ఆత్మహత్య నాటకం ఆడుతున్నారేమో అని అనుమానిస్తున్నారు.
ఇదిలావుంటే తెలంగాణలో మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విజయనగరంలో మాదిరిగానే ఓ ఛోరీ కేసులో మరియమ్మను అరెస్ట్ చేసిన పోలీసులు అతి దారుణంగా చితకబాదడంలో లాకప్ లోనే చనిపోయింది.
ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలోని కోమట్లగూడెం గ్రామానికి చెందిన మరియమ్మ ఆమె కొడుకు ఉదయ్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చర్చిలో పనిచేసేవారు. వీరు చర్చిలో పనిచేసే సమయంలో డబ్బులు పోయాయని చర్చి ఫాదర్ ఫిర్యాదు చేయడంతో మరియమ్మతో పాటు ఆమె కొడుకు ఉదయ్, అతని స్నేహితుడు శంకర్ లను అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు.
అయితే పోలీసులు కొట్టిన దెబ్బలకు తన తల్లి మరియమ్మ తన చేతుల్లోనే చనిపోయిందని ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో డీజీపికి ఈ విషయాన్ని ఉదయ్ తెలిపారు. మరియమ్మ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌పై వేటుపడింది.
దళిత మహిళ లాకప్ డెత్ పై దళిత సంఘాల ఆందోళనతో టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించింది. మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమొ కొడుకు ఉదయ్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించనుందని ప్రకటించారు. అంతేకాదు ఉదయ్ కి ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇక మరియమ్మ మృతికి కారకులైన పోలీసులపై చర్యలకు ముఖ్యమంత్రి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశించారు.
