వారిద్దరికీ పదేళ్ల క్రితమే పెళ్లయ్యింది. కొంతకాలం పాటు వీరి సంసారం సవ్యంగానే సాగింది. అనుకోకుండా భర్త చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. ఈ విషయంలో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. చెడు వ్యసనాలు వదులుకోమని భార్య.. భర్తను మందలించడం మొదలుపెట్టింది. అంతే.. కోపంతో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బేతల గోవిందకు (ఆటో డ్రైవర్‌), కొంగవానిపాలెం కోరాడోడు కళ్లాలకు చెందిన మంగమ్మకు పదేళ్ల కిందట వివాహమైంది. కొన్నాళ్లు వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. వీరికి రాజేష్‌ (10), రమేష్‌ (8) ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్ల నుంచి గోవింద చెడు వ్యసనాలకు బానిస కావడంతో భార్య మంగమ్మ మందలించేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గోవింద కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం అత్తవారింటికి వచ్చాడు.


శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ తలెత్తడంతో కోపోద్రిక్తుడైన గోవింద ఆటోలో ఉన్న రాడ్డుతో భార్య తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అడ్డుకోబోయిన బావమరుదులపై కూడా దాడి చేసి గాయపరిచాడు. మృతురాలి చెల్లి గోవిందమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై యు. మహేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.