ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కత్తితో పొడిచి చంపి పారిపోయారు. ఈ  ఘటన భామిని మండలంలో దిమ్మిడిజోల ఇసుకగూడ గ్రామాల మధ్య సోమవారం జరిగింది. 

బత్తిలి పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... నేరడి పంచయతీ లోహరిజోల గ్రామానికి చెందిన నల్లకేవటి కుమారస్వామి తన భార్య మాలతి, ఇద్దరు పిల్లతో ద్విచక్రవాహనంపై పర్లాఖెముండి వెళ్లుతున్నారు. ఈ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు టూవీలర్ మీద వచ్చి కుమారస్వామి టూవీలర్ ను ఆపారు. వెంటనే కత్తితో మెడ, ఛాతి మధ్యలో బలంగా రెండు సార్లు పొడిచారు. 

దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. హంతకులను ఆపేందుకు భార్య ప్రయత్నించినా తనను తోసేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న బత్తిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నానికి పాలకొండ డీఎస్పీ ఎం. శ్రావణి, కొత్తూరు సీఐ మజ్జి చంద్రశేఖర్ లు మృతుని భార్యనుంచి వివరాలు రాబట్టారు. ఆమె వద్దనున్న ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 

కుమారస్వామి మృతితో ఆయన ఇద్దరు చిన్నారులు తండ్రిలేనివారయ్యారని బంధువులు రోదిస్తున్నారు. వీరి కుటుంబం గతంలో వలస వెళ్లిపోయి మూడేళ్ల కిందట తిరిగి స్వగ్నామానికి వచ్చింది. అతను టైలరింగ్ పనిచేస్తూ గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవారని గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.