కేవలం ఓ సెల్ ఫోన్ కోసం ఓ వ్యక్తి బహిరంగంగానే దారుణ హత్యకు గురయిన దారుణం కృష్ణా జిల్లా నందిగామలో చోటుచేసుకుంది.
ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నందిగామ మండలం కేత వీరునిపాడు గ్రామానికి చెందిన జమ్ముల పుల్లారావు మొక్కపాటి శ్రీనివాస రావులకు మొబైల్ విషయంతో గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీనివాసరావు పుల్లారావుతో పాటు అడ్డువచ్చిన అతడి భార్యపైనా విచక్షణారహితంగా కర్రతో దాడికి పాల్పడ్డాడు.
తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న దంపతులిద్దరి గ్రామస్తులు సహాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ పుల్లారావు మృతి చెందాడు. అతడి భార్య పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
సెల్ ఫోన్ గొడవ, పుల్లారావు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక విచారణ జరిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని... పుల్లారావు దంపతులపై దాడికి పాల్పడిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
