అమానుష ఘటన.. దొంగతనం చేశారనే నెపంతో బందీ.. మహిళలపై పాశవిక దాడి..
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో దొంగతనం చేశారనే అనుమానంతో, దళిత మహిళపై విచక్షణ రహితంగా దాడి చేశారు. నేరం ఒప్పుకోవాలంటూ ఆ ఇద్దరు ఎస్టీ మహిళలపై ఓ యువకుడు తీవ్రంగా దాడి చేసి, ఆ తర్వాత పోలీసుల చేత కొట్టించిన సంఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె. కొత్తపాలెంలో సంచలనంగా మారింది.

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే.కొత్తపాలెం గ్రామంలో అమానుషం ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో దొంగతనం చేశారనే అనుమానంతో, నేరం ఒప్పుకోవాలంటూ ఓ వ్యక్తి ఇద్దరు ఎస్టీ మహిళలపై పైశాచిక దాడి చేశాడు. తాము ఎలాంటి నేరం చేయలేదని, తమకు ఎలాంటి పాపం తెలియదని ప్రాదేయపడిన ఫలితం లేకుండా పోయింది.
కనీసం ఆడవారనే దయ లేకుండా పాశవికంగా దాడి చేశాడు. ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆ తర్వాత పోలీసుల చేత కొట్టించడం. వారిని రెండు రోజులుగా బందీలుగా చేసి ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తరలించారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలని మాపై దాడికి పాల్పడ్డారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకెళ్తే.. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే.కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్తి రాజా బాబు అనే వ్యక్తి ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతోంది. దీంతో తమ ఇంట్లో పని చేయాలని అదే గ్రామానికి చెందిన దుర్గ అనే ఎస్టీ యానాది కులానికి చెందిన యువతిని (18) పనికి పిలిచారు. ఈ తరుణంలో వారి ఇంట్లో చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు కనిపించడం లేదు. దీంతో ఇంట్లో పని చేస్తున్న ఆ యువతిపై నింద మోపారు.
ఆ యువతే దొంగతనానికి పాల్పడినట్టు ఆరోపించారు. అంతటితో ఆగకుండా..ఆ యువతిపై విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రాదేయపడ్డ వినలేదు. బలవంతంగా నేరాన్ని ఒప్పుకోవాలంటూ మరోసారి పోలీసులతో కొట్టించారు. ఈ క్రమంలో ప్రశ్నించిన బాధితురాలి తల్లిని సైతం కొట్టారని బాధిత యువతి కన్నీటి పర్యంతమయ్యారు.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షులు గోవర్థన్, బాధితులను స్థానిక ఆస్పత్రిలో తరలించారు. వారికి వైద్య సహాయం అందించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.