బావమరిది బతకకోరతాడంటారు.. కానీ ఆ బావమరిదే బావ పాలిట కాలయముడయ్యాడు. అక్కను హింసిస్తున్నాడని సొంత బావనే కడతేర్చేడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పందేరుపల్లెలో గురువారం ఈ దారుణం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాగరాజు (35) కనిపించడం లేదని కుటుంబ సభ్యలు 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

ఈ క్రమంలో క్యాటిల్ ఫామ్ కు చెందిన ఓ అనుమానితుడిని విచారించగా నాగరాజును, అతడి బావ మరిది నవీన్ కుమార్ హత్య చేసినట్లు వెల్లడైంది. దీంతో నవీన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అక్కను బావ చిత్రహింసలు పెడుతుండడంతో హత్య చేసినట్లు నవీన్ కుమార్ తెలిపాడని సమాచారం. 

మద్యం మత్తులో ఉన్న నాగరాజును బండరాయితో కొట్టి హత్య చేసి పాతిపెట్టినట్లు నిందితుడు వివరించాడని సమాచారం. ఈ కేసులో పూర్తి వివరాలను శుక్రవారం వెల్లడిస్తామని సీఐ జయరామయ్య తెలిపారు.