కంకిపాడు:ఇంటి వద్ద దింపుతానని చెప్పి తన బైక్‌పై తీసుకెళ్లిన ఓ నర్సుపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. నిందితుడి బైక్‌పై నుండి దూకి ఆమె తప్పించుకొంది.  ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకొంది.

ఆటో కోసం వేచి చూస్తున్న యువతిని అక్కా ఇంటి వద్ద దింపుతానని చెప్పి పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆ యువకుడిని స్థానికులు చితకబాదారు. 

కంకిపాడు మండలం గొడపర్రు గ్రామానికి చెందిన యువతి కంకిపాడులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. బుధవారం రాత్రి కంకిపాడు వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తుంది. అదే గ్రామానికి చెందిన రవీంద్ర అనే యువకుడు ఆమె వద్దకు వెళ్లి అక్కా కంకిపాడు వెళ్తున్నా నిన్ను కూడ  అక్కడ దింపుతానని ఆమెను తీసుకెళ్లాడు.

కంకిపాడు లాకుల వద్దకు రాగానే వాహనం వేగం పెంచి ఒక్కసారిగా గోసాల వైకుంఠపురం వైపు మళ్లించాడు.  ఇతనిపై అనుమానం వచ్చిన ఆ యువతి వాహనాన్ని నిలిపి వేయాలని  కోరింది. కానీ అతను వాహనాన్ని ఆపలేదు. దీంతో  బైక్ నుండి దూకేస్తానని ఆ యువతి హెచ్చరించింది. దూకితే చస్తావ్ అంటూ అతడు హెచ్చరించాడు.  

దీంతో ఆ యువతి ద్విచక్ర వాహనంపై  నుండి దూకింది. పైగా  బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఈ కేకలను విని స్థానికులు బాధితురాలు అక్కడికి చేరుకొని నిందితుడిని చితకబాదారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.