కుక్కునూరు: నేటి సమాజంలో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు, స్నేహితులకంటే చివరకు ప్రాణాలకంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యత వుంది. ఆర్దిక వ్యవహారాలు మనుషుల చేత ఎన్నో దారుణాలు చేయిస్తోంది. అలా కేవలం రూ.500 కోసం రాష్ట్రాలు దాటి ఉపాధి కోసం కలిసివచ్చిన ప్రాణ స్నేహితుడినే అతి దారుణంగా హతమార్చాడో వ్యక్తి. ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిషా రాష్ట్రానికి చెందిన సిభరామ్‌దాస్‌, దుర్బధన్‌ లు మంచి స్నేహితులు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో తమ స్వస్థలం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కుక్కునూరుకు వలస వచ్చారు. ఓ మేస్త్రీ వద్ద వీరిద్దరు కూలీలుగా చేరి ఓ రేకుల షెడ్డును ఏర్పాటుచేసుకుని నివాసముంటున్నారు. 

అయితే ఇటీవల దుర్బధన్‌కు అవసరం వుండటంతో సిభరామ్‌దాస్‌ వద్ద రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. అందులోంచి రూ.500 తిరిగి చెల్లించగా మరో రూ.500 చెల్లించాల్సి వుంది. ఈ డబ్బుకోసం ఈ నెల 2న ఇరువురు మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో సిభరామ్‌దాస్‌ను దుర్బధన్‌ చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని   పొదల్లో పడేసి పారిపోయాడు. 

ఇది జరిగిన నాలుగురోజులకు స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా రూ.500 కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసినట్లు తేల్చారు. దీంతో పోలీసులు దుర్భదన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.