Asianet News TeluguAsianet News Telugu

‘ముందస్తు’ ఎన్నికలు లేనట్లే...

  • రాజకీయపార్టీలు ప్రశాంతంగా తమ పని తాము చేసుకోవచ్చు.
  • ఎందుకంటే, ముందస్తు ఎన్నికలు లేవని తేలిపోయింది.
Majority states and parties rejected pre poll proposals

రాజకీయపార్టీలు ప్రశాంతంగా తమ పని తాము చేసుకోవచ్చు. ఎందుకంటే, ముందస్తు ఎన్నికలు లేవని తేలిపోయింది. దాదాపు 6 నెలలుగా ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి తెగ హడావుడి మొదలుపెట్టేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి నుండి వచ్చిన సంకేతాల కారణంగానే ముందు చంద్రబాబు హడావుడి మొదలుపెట్టారు. దాంతో జగన్ కూడా అనుసరించారు. జగన్ చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర అయినా, చంద్రబాబు మొదలుపెట్టిన ఇంటింటికి తెలుగుదేశంపార్టీ కార్యక్రమమైనా ముందస్తు ఎన్నికల సన్నాహాల్లో భాగమే.

అయితే, కేంద్ర ఎన్నికల కమీషన్ జరిపిన కసరత్తులో చాలా రాష్ట్రాలు ముందస్తుకు అంగీకరించలేదట. రాష్ట్రాలే కాదు చివరకు రాజకీయ పార్టీలు సైతం పెద్ద ఆసక్తి చూపట లేదట. విచిత్రమేమిటంటే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా వ్యతిరేకించారట. అందుకు కారణం ప్రధానంగా జనాభిప్రాయం విషయంలో కేంద్రానికి అనుమానాలుండటమే. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ లాంటి ప్రజావ్యతిరేక విధానాలను బలవంతంగా జనాలపై రుద్దటంతో ముందస్తు ఫలితాలు ఎలాగుంటాయో అన్న విషయంలో భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేసారట. దాంతో కేంద్రం కూడా ముందస్తు ఆలోచనకు స్వస్తి పలికినట్లే అని సమాచారం.

కేంద్రం నుండి ఈ విషయంలో అనధికారికంగా సమాచారం అందటంతో రాష్ట్రంలోని టిడిపి, వైసీపీలు డీలా పడ్డాయి. ఎందుకంటే, జగన్ విషయమే తీసుకుంటే ఇటీవలే మొదలుపెట్టిన ప్రజా సకల్పయాత్ర ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నదే. ఈ యాత్ర 7 నెలల పాటు జరుగుతుంది. యాత్ర ముగిసిన 6 మాసాల్లోగా ఎన్నికలుంటాయని అంచనా వేసుకున్నారు. కాబట్టి ఈ యాత్ర తాలూకు ప్రభావం జనాల్లో ఉంటుందని వైసీపీ అంచనా వేసింది. కానీ ఇపుడు ముందస్తు ఎన్నికలు లేవంటే యాత్ర ముగిసిన తర్వాత ఏడాదికి పైగా సమయముంటుంది. మరి, అంతకాలం యాత్ర ప్రభావం జనాల్లో ఉంటుందా అన్నది అనుమానమే.

అదే విధంగా ఇంటింటికి తెలుగుదేశంపార్టీ కార్యక్రమం కూడా అదే. ముందస్తును అంచనా వేసుకునే చంద్రబాబు కార్యక్రమం రూపొందించారు. ముందస్తు లేదని తేలిపోవటంతో నేతల్తో నిస్తేజం వచ్చేస్తుంది. సరే, అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఎలాగోలా నెట్టుకొచ్చేస్తారు. మరి, జగన్ పరిస్ధితేంటి ?

 

Follow Us:
Download App:
  • android
  • ios