కాకినాడ : మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. హర్షకుమార్ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీ హర్షకుమార్‌ చెప్పిన పార్టీకి సపోర్టు చేయకుండా తాము వైసీపీకి పని చేయడంతో తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని మహాసేన దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాజేష్‌ సరిపెల్ల ఆరోపించారు. 

హర్షకుమార్‌ అనుచరులు తమను రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హర్షకుమార్‌ వల్ల తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మీని కలసి తమకు వస్తున్న బెదిరింపులపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హర్షకుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు, మహాసేన సభ్యులకు రక్షణ కల్పించాలని కోరినట్లు రాజేశ్ తెలిపారు.