తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం  ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. 

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఉదయం హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేపట్టారు.

 శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారుకూర్చను టీడీపీ సిద్ధం చేసింది. 300 గ్రాముల బంగారంతో దీనిని తయారుచేశారు. సాధారణంగా వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు ఉపయోగిస్తారు.

మహాసంప్రోక్షణను పరమపవిత్రంగా భావించిన భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నారు.యాగశాలలో రోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుండి హోమాలు నిర్వహిస్తారు. 

ఈ కార్యక్రమంలో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, ఓఎస్‌డి పాల శేషాద్రి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, పేష్కార్లు రమేష్‌బాబు, నాగరాజ, బొక్కసం సూపరింటెండెంట్‌ గురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.